వికటించిన ఇంజక్షన్‌ – ఏడుగురు చిన్నారులకు అస్వస్థత

Feb 10,2024 21:01

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (కృష్ణా):ఇంజక్షన్‌ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జలుబు, దగ్గుతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాలుగు సంవత్సరాల్లోపు తొమ్మిది మంది చిన్నారులు చికిత్స నిమిత్తం శుక్రవారం ఆస్పత్రికి వచ్చారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో వారికి అమాక్ల్సిన్‌ పొటాషియం క్లావులనేట్‌ ఇంజక్షన్‌ను వేశారు. గంట తర్వాత చిన్నారులు అయాన్షి, యోషిత, నాగమణికంఠ, మహమ్మద్‌ రేహాన్‌, గాయత్రీ, వర్షిత, పార్థులకు విపరీతమైన జ్వరం రావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఏడుగురు చిన్నారులకు ప్రత్యేక వైద్యం అందించారు. చిన్నారులు కోలుకున్న తర్వాత వారిని డిశ్చార్జి చేశారు. అస్వస్థతకు గురైన చిన్నారులను సిఐటియు నాయకులు సుబ్రహ్మణ్యం, సిహెచ్‌ జయరావు, టిడిపి నాయకులు కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ పరామర్శించారు.చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉంది : ఆస్పత్రి సూపరింటెండెండ్‌మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏడు మంది చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌ కుమార్‌ వెల్లడించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో వారికి అమాక్స్లిన్‌ పొటాషియం క్లావులనేట్‌ ఇంజక్షన్‌ను వైద్యులు వేశారని, ఆ ఇంజక్షన్‌ సరైన మందు అని, కాల పరిమితి లోనిదేనని చెప్పారు. చిన్నారుల ఆరోగ్యం గురించి ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూపరింటెండెంట్‌ తెలిపారు.

➡️