మోడీ విధానాలతో దేశంలోతీవ్ర సంక్షోభం

Mar 29,2024 23:54 #Modi policies, #Serious crisis

– జిడిపి లెక్కలన్నీ వండి వార్చేవే
– ఉద్యోగాలు, ఉపాధి లేక కుటుంబాలు కూలిపోతున్నాయి
– రాష్ట్రాలను ఊపిరి సలపనీయకుండా నులిమేస్తున్నారు
– ప్రముఖ రాజకీయ, ఆర్థిక నిపుణులు పరకాల ప్రభాకర్‌
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి వచ్చి మోడీ ఆర్థిక విధానాలు ఇలాగే కొనసాగితే దేశంలో ‘గంభీర సంక్షోభం’ ఏర్పడుతుందని, ప్రభుత్వం మారకపోతే ప్రజాస్వామ్యంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ అన్నారు. ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన ‘సంక్షోభంలో నవభారతం, ఆర్థిక రాజకీయ పరిణామాలు’ అనే అంశంపై శుక్రవారం బాలోత్సవ భవన్లో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే పార్లమెంటు సాక్షిగా ముస్లిము వ్యతిరేక ప్రకటనలు చేస్తారని, ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న ఘటనలు రాష్ట్రంలోకి, ప్రతి గ్రామంలోకి వస్తాయని తెలిపారు. ప్రజాస్వామ్యదేశంలో వచ్చే ఎన్నికలు ఆఖరివి కాకుండా ఉండాలంటే బిజెపిని ఓడించాలని ఆయన కోరారు. స్వాతంత్య్ర ఉద్యమంలో నూలుపోగంత పాత్ర లేనివారు నేడు దేశభక్తులమని చెప్పుకుంటూ మార్కెట్‌ చేసుకుంటున్నారని, నవభారతదేశంలో ఇదొక కొత్త లక్షణమని అన్నారు. ఇటీవల 35 వేల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయని, దీన్నిబట్టి సంక్షోభం ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. గతిలేక కుటుంబాలను పోషించుకునేందుకు యుద్ధాలు జరుగుతున్న ఇజ్రాయిల్‌, ఉక్రెయిన్‌ సైతం వెళ్లి ప్రాణాంతక పనులు చేసేందుకు యువత సిద్ధపడుతున్నారని, సంక్షోభం తీవ్రతకు ఇది అద్దం పడుతుందని తెలిపారు. ‘ఇక్కడ బతకలేక చచ్చేకంటే అక్కడకు వెళ్లి ఎంతోకొంత ఇంటికి పంపించి ఎన్నాళ్లుంటే అన్నాళ్లు బతికితే చాలని’ ఇజ్రాయిల్‌, ఉక్రెయిన్‌ పోతున్న యువత చెబుతున్నారంటే మోడీ చెబుతున్న లెక్కలు ఎంత మోసపూరితమో, ఘోరమో అర్థం చేసుకోవచ్చని అన్నారు. 20-25 ఏళ్ల మధ్య వయసున్న వారిలో నిరుద్యోగం 42 శాతానికి చేరిందని పేర్కొన్నారు. నేటి భారతంలో ఉద్యోగం పొందడం అత్యంత కష్టతరమైందని సిఎస్‌డిఎస్‌ (సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌) నిర్వహించిన సర్వేలో తేలిందన్నారు. నిరుద్యోగం గురించి ప్రభుత్వాలు ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారమూ ఇవ్వడం లేదని తెలిపారు. తనను ఫలానా వాళ్లు అన్నిసార్లు తిట్టారని కచ్ఛితమైన లెక్కలు చెప్పే మోడీకి కరోనా కాలంలో ఎంతమంది చనిపోయారో లెక్కతెలియదని, ఇంతకంటే అమానుషం ఇంకొకటి ఉండదని చెప్పారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, ఆహార ద్రవ్యోల్బణం సగటున 20 శాతానికి చేరిందని, ఆదాయాలు లేక బతకలేని పరిస్థితుల్లో కుటుంబాలూ కూలిపోతున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో కార్పొరేట్‌ ట్యాక్స్‌ 19 శాతం తగ్గించారని, బ్యాంకుల నుండి ఆయా సంస్థలు తీసుకున్న రూ.25 లక్షల కోట్లను మాఫీ చేశారని, కేవలం రూ.2 లక్షల కోట్లు తిరిగి రాబట్టగలిగారని అన్నారు. దేశానికి రావాల్సిన పెట్టుబడులు 30 శాతం నుండి 19 శాతానికి తగ్గిపోయాయని, ఎఫ్‌డిఐలు క్రమంగా తగ్గిపోతున్నాయని చెప్పారు. ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని అన్నారు. రాష్ట్రాల హక్కులను హరించి వేస్తూ వాటి పీకనులిమేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేసిన వారు సాక్షులుగా బెయిల్‌పై బయట తిరుగుతున్నారని, ఆయన మాత్రం జైల్లో ఉన్నారని, దీనివెనుక ఎలక్టోరల్‌ బాండ్ల మహిమ ఉందని పేర్కొన్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా దేశ ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన ఐలు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. బిజెపి పాలకులు వారికి అనుకూలంగా చట్టాలను మారుస్తున్నారని, దేశ ద్రోహులు పాలకులైతే దేశభక్తులను ద్రోహులుగా ప్రచారం చేస్తారని మోడీ, బిజెపి చేస్తోందని అదేనని అన్నారు. దేశంలో న్యాయ రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం జరుగుతోందని, ప్రశ్నించేవారికి స్థానంలేని పరిస్థితిని సృష్టించారని పేర్కొన్నారు. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ ప్రధాన కార్యదర్శి చలసాని అజరుకుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలు ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ.. కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి దుర్మార్గమైన పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. మోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుండటం దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. తొలుత వక్తలను బెజవాడ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు సంపర దుర్గాశ్రీనివాసరావు వేదిక మీదకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు, ఆమ్‌ ఆద్మీ పార్టీ న్యాయవిభాగం నాయకులు చల్లగుండ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️