Chhattisgarh రాజకీయాల్లో సంచలనం – 73 మంది అభ్యర్థులపై అనర్హత వేటు

ఛత్తీస్‌గఢ్‌ : ఎన్నికల వేళ … ఛత్తీస్‌గఢ్‌ రాజకీయాల్లో సంచలనం రేగింది. ఎన్నికల నిబంధనలను పట్టించుకోని 73 మంది అభ్యర్థులపై భారత ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఛత్తీస్‌గఢ్‌లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. వీటిని పరిశీలించాక సంబంధిత అధికారులు అనర్హుల జాబితాను విడుదల చేశారు.

డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి యుఎస్‌ బాండే మాట్లాడుతూ … రారుపూర్‌ జిల్లా నుండి గరిష్టంగా 17 మంది అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. ఈ అనర్హుల జాబితాను భారత ఎన్నికల సంఘం వెబ్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేసిందని చెప్పారు. ఖర్చు వివరాలు తెలియజేయని లేదా ఇతర నిబంధనలను పాటించని ఈ అభ్యర్థులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదంటూ … భారత ఎన్నికల సంఘం తన వెబ్‌ సైట్‌లో ఈ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. అనర్హతకు గురయిన ఈ 73 మందిలో 65 మంది అభ్యర్థులు 2024 వరకు, ఎనిమిదిమంది అభ్యర్థులు 2025 వరకు ఎన్నికల్లో పోటీ చేయలేరు.

ఛత్తీస్‌గఢ్‌లోని 11 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్‌ను నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 19న రాష్ట్రంలో తొలి దశ పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్‌ 19న ఒక స్థానానికి, ఏప్రిల్‌ 26న మూడు స్థానాలకు, మే 7న ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

➡️