ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ప్రజాశక్తి-పీలేరు : అక్రమంగా తరలిస్తున్న రూ.12 లక్షలు విలువ చేసే 8 ఎర్రచందనం దుంగలను, కారును స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు అటవీశాఖ సంచారదళ నిఘా విభాగం డిఎఫ్‌ఒ జెవి.సుబ్బారెడ్డి తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందని మంగళవారం రాత్రి తమకు అందిన సమాచారం మేరకు, చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం కొత్తపేట సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా రొంపిచర్ల వైపు నుంచి వేగంగా వచ్చిన కారును ఆపాలని సిగల్‌ ఇచ్చామని చెప్పారు. బుధవారం ఉదయం ఆ వాహనం ఆగకుండా వేగంగా గంగాధరనెల్లూరు వైపు దూసుకు వెళ్ళిందని తెలిపారు. అప్రమత్తమైన తమ సిబ్బంది ఆ వాహనాన్ని వెంబడించగా గంగాధర నెల్లూరు మండలం కొత్త వెంకటాపురం వద్ద కారు ఆపి డ్రైవర్‌ చీకట్లో పరారయ్యాడని తెలిపారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 208 కేజీల బరువు గల 8 ఎర్రచందనం దుంగలను గుర్తించినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న కారు ఎర్రచందనం విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో ఎఫ్‌ఆర్‌ఒఎన్‌ వెంకటరమణ, ఎఫ్‌బిఒకె. ప్రతాప్‌, ప్రొటెక్షన్‌ వాచర్లు ప్రభుతేజ, వెంకటేష్‌, మల్లికార్జున, డ్రైవర్‌, చరణ్‌ పాల్గొన్నారు.

➡️