సెక్టోరియల్‌ అధికారులదే కీలకపాత్ర

Apr 20,2024 22:28
పోలింగ్‌ ప్రక్రియ అంతటిలో

ప్రజాశక్తి – కాకినాడ

పోలింగ్‌ ప్రక్రియ అంతటిలో సెక్టోరియల్‌ అధికారులదే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. శనివారం కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జడ్‌పి సమావేశ మందిరంలో నిర్వహించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సెక్టోరియల్‌ అధికారుల శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ రోజున సెక్టోరియల్‌ అధికారులు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభించడం, ఇవిఎం, వివిప్యాట్స్‌ పనితీరు, డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ సెంటర్స్‌ సెక్టోరియల్‌ అధికారుల విధులు తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్టోరియల్‌ అధికారులకు తమకు కేటాయించిన రూట్‌లో తప్పనిసరిగా మూడుసార్లు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించాలన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో దొర్లిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని 2024 సాధారణ ఎన్నికల్లో సిబ్బంది శిక్షణ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. సెక్టోరియల్‌ అధికారులు పోలింగ్‌ ప్రక్రియ, ఇవిఎంల పనితీరుపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రతి సెక్టోరియల్‌ అధికారికి పది నుంచి పన్నెండు పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయని ఈ పోలింగ్‌ కేంద్రాల్లో నిర్దేశించిన సమయానికి ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభం అయ్యేవిధంగా సెక్టోరియల్‌ అధికారులు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకో వాలన్నారు. పోలింగ్‌కు ముందు రోజు డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లలో, పోలింగ్‌ ముగిసిన తర్వాత రిసెప్షన్‌ సెంటర్ల వద్ద పోలింగ్‌ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పని చేయలన్నారు. ఏ పోలింగ్‌ కేంద్రంలోనైనా ఇవిఎం, వివిప్యాట్స్‌ లలో టెక్నికల్‌గా సమస్యలు తలత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. తమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు పడకుండా టాయిలెట్స్‌, విద్యుత్‌, తాగునీరు, ఫర్నిచర్‌ వంటి సదు పాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ ప్రక్రియలో సెక్టోరియల్‌ అధికారులు నూరు శాతం నిమ గమై ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ట్రైయిని కలెక్టర్‌ హెచ్‌ఎస్‌.భావన, జిల్లా పంచాయతీ అధికారి కె.భారతి సౌజన్య, ఇతర మాస్టర్‌ ట్రైనీస్‌ పాల్గొన్నారు.

➡️