నేటి నుంచి రెండో దశ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’

Jan 1,2024 21:45 #Jagananna Arogya Suraksha
  •  6 నెలల్లో 13,459 ఆరోగ్య శిబిరాలు నిర్వహణకు ఏర్పాట్లు
  • ప్రతి ఇంటినీ రెండుసార్లు సందర్శించనున్న వలంటీర్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశను మంగళవారం నుంచి నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. ఆరు నెలలపాటు నిర్వహించే రెండో దశ కార్యక్రమంలో 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించనుంది. తొలిదశలో నిర్వహించిన కార్యక్రమంలో 12,423 ఆరోగ్య శిబిరాల్ని నిర్వహించడం ద్వారా 1,64,982 మంది పేషెంట్లను వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు తరలించి వారికి ఉచిత వైద్య సేవల్ని అందించారు. రెండోదశ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఇళ్లల్లో ఉన్న దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు, బాలింతలతోపాటు ప్రసవానంతర శిశు సంరక్షణ సేవలు, అన్ని వయసుల వారి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవల్ని అందించనున్నారు. అవసరమైన సందర్భాల్లో నెట్వర్క్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఆరోగ్య శిబిరం నిర్వహణ తేదీని ముందు ప్రతి వలంటీరూ రెండుసార్లు ప్రతి ఇంటికీ తిరిగి వివరాలను తెలియజేయాల్సి వుంటుంది. మొదటిసారి వైద్య శిబిర నిర్వహణకు 15 రోజుల ముందు, రెండోసారి శిబిర నిర్వహణ తేదీని గుర్తు చేసేందుకు మూడు రోజుల ముందు వలంటీర్లు ఇళ్లను సందర్శిస్తారు. వైద్య శిబిరాల్ని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, పట్టణ, వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తారు. మొత్తం మండలాలను సమానంగా విభజించి మంగళవారం తొలి అర్ధభాగంలోనూ, శుక్రవారం మిగిలిన ప్రాంతాల్లోనూ శిబిరాల్ని నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాల్లో ప్రతి బుధవారం ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తారు. ప్రతి ఆరోగ్య శిబిరంలో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లతో కలిపి కనీసం ముగ్గురు డాక్టర్లు, ఒక పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ బాధ్యతలు నిర్వహిస్తారు. రెండో దశ ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో గ్రామీణ ప్రాంతాల కోసం 92 రకాల మందులు, పట్టణ ప్రాంతాల కోసం 152 రకాల మందులను సిద్ధం చేశారు. వీటితోపాటు అత్యవసర వినియోగం కోసం మరో 14 రకాల మందుల్ని, వైద్య పరీక్షల నిర్వహణ కోసం 7 రకాల కిట్లను సిద్ధంగా ఉంచినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది.

➡️