గడ్డి దగ్ధంతో పశువుల మేత కొరత

Dec 29,2023 00:21

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా అనేక ప్రాంతాల్లో వరి నాట్లు నాటలేదు. వేసిన రైతులకు కూడా అధిక కూలి రేట్లను తట్టుకోలేక ముందుగానే హార్వెస్టర్లు వినియోగించి వరి కోతల చేపట్టారు. తద్వారా వచ్చిన గడ్డిని రైతులు పంట పొలంలోనే ఎద జిమ్మీ దానిని నిప్పంటించి తగలబెడుతున్నారు. దీని కారణంగా పశువుల మేత కొరత తీవ్రంగా ఏర్పడనుంది. ఓ ప్రక్క హార్వెస్టర్ వినియోగంతో రైతులకు కొంతమేర ఖర్చులు భారం తగ్గుతున్నప్పటికీ పశు పోషకులకు మాత్రం ఇది తీవ్ర పరిణామాలను చూపించనుంది. గత ఏడాది జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వరినట్లు వేసినప్పటికీ పశువుల మేతకు ఎకరా గడ్డి రూ.10వేల వరకు ధర పలికింది. ఈ ఏడాది వరిసాగు తక్కువ కావటమే కాక వేసిన ప్రాంతాల్లో రైతులు గడ్డిని తగలబెట్టడంతో ఎకరా గడ్డి రూ.20వేలు పలికిన ఆశ్చర్యం లేదని పలువురు రైతులు వ్యాకరిస్తున్నారు. గతంలో రైతు వారీగా సొంత భూములు కలిగిన వారే అధికశాతం పశువులను మేపేవారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే పశుపోషకులుగా ఉన్నారు. వీరిలో కూలి నాలి చేసుకుని పశువులను మేపుకుంటూ, కౌలు భూములు సాగు చేసుకుని జీవనం సాగించేవాల్లే ఎక్కవు మంది ఉన్నారు. పాడి పశువులపైనే ఆధారపడి జీవించే బడుగు బలహీన వర్గాల వారికి మేత కొరత తీవ్ర భారంగా మారనుంది. గడ్డిని తగలబెట్టడంతో కొంతమేర వాతావరణ కాలుష్యం ఏర్పడే పరిస్థితి ఉన్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంబంధిత అధికారులు సైతం దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్న దాఖలాలు లేవు. రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

➡️