సారిపల్లిని నట్టేట ముంచేశారు..

Apr 8,2024 21:34

 వైసిపి, టిడిపిపై గ్రామస్తుల ఆగ్రహం

పిఎఎఫ్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌

ప్రజాశక్తి – నెల్లిమర్ల : తారకరామ తీర్థ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామం సారిపల్లిని వైసిపి, టిడిపి పార్టీలు పిఎఎఫ్‌ విషయంలో నట్టేట ముంచేశాయి. ముఖ్యంగా 2004లో తారకరామ తీర్థ ప్రాజెక్టు నిర్మాణంలో సారిపల్లి భూములు మునిగి గ్రామం మాత్రమే మిగిలింది. అప్పట్లో గ్రామస్థులు సిపిఎం సహకారంతో పునరావాస ప్యాకేజీ కోసం పోరాటాలు చేసి అరెస్టులకు గురై కేసులు కూడా ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి సారిపల్లి గ్రామస్థులు కాలువ డిజైన్‌ మార్చమని అప్పట్లో కాంగ్రెస్‌, టిడిపి, పార్టీలను అడిగినా ఫలితం దక్కలేదు. ఈ గ్రామంలో సుమారుగా 1450 కుటుంబాలకు 75 కోట్ల బడ్జెట్‌ కేటాయించి పిఎఎఫ్‌ (ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతం) ప్యాకేజీ మంజూరు చేసామని సాక్షాత్తూ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారని కానీ ఇంత వరకూ తమకు డబ్బులు అందలేదని వాపోతున్నారు. కాగా అధికార వైసిపి మీద నమ్మకంతో సర్పంచ్‌ ఎన్నికల్లో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థికి అత్యధిక మెజార్టీతో గెలిపించిడమే కాకుండా ఎంపిటిసి స్ధానం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని చెబుతున్నారు. గ్రామం మొత్తం అధికార వైసిపికి అన్ని విధాలా సహకరించినప్పటికీ పిఎఎఫ్‌ విషయంలో మొండి చెయ్యి చూపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోరాటాలు చేయడంతో కొంత మందికి పిఎఎఫ్‌ డబ్బులు చెల్లించి మరికొంత మందికి చెల్లించకపోవడంతో వ్యతిరేక ఎదురైందని దీంతో నాయకులను ప్రశ్నించేసరికి మొత్తం నిధులు ఇవ్వకుండా ఆపేశారుని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత టిడిపి ప్రభుత్వం కూడా పిఎఎఫ్‌ అమలు విషయంలో హడావుడిగా గత ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు అమలు చేస్తున్నామని నోటిఫికేష్‌ విడుదల చేసినప్పటికీ తరువాత పట్టించుకోలేదు. ఏదేమైనా పిఎఎఫ్‌ అమలు విషయంలో అధికార వైసిపి, టిడిపిలు సారిపల్లి గ్రామాన్ని నట్టేట ముంచాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గ్రామంలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లడంతో వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో శంకుస్థాపనులు చేయకుండానే నాయకులు వెనుదిరిగారు. ఈ ఏడాది ఎన్నికల ముందైనా తమకు రావాల్సిన పిఎఎఫ్‌ నిధులుపై కచ్చితమైన రాతపూర్వక హామీ ఇస్తేనే గ్రామమంతా ఓట్లు వేస్తామని చెబుతున్నారు.

➡️