బకాయి జీతాలు వెంటనే విడుదల చేయాలి 

Feb 21,2024 16:28 #Manyam District
Salary arrears should be released immediately
  • గ్రీన్ అంబసిడర్ల  యూనియన్ డిమాండ్
    పార్వతీపురం కలక్టరేట్ వద్ద ధర్నా

ప్రజాశక్తి-పార్వతీపురం : స్వచ్ఛ భారత్ గ్రామ పంచాయితీ గ్రీన్ అంబసిడర్లకు గత పన్నెండు నెలలుగా బకాయిలో ఉన్న జీతాలు వెంటనే చెల్లించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆ.ప్ర గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ మరియు వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం జిల్లావ్యాప్తంగా ఉన్న గ్రీన్ అంబాసిడర్లు పార్వతీపురం స్థానిక సుందరయ్య భవనం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, డిపిఆర్ఓ ఇన్చార్జ్ కేశవ నాయుడుకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు జె.గౌరి, టి.అశోక్, సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ మన్యం జిల్లాలో గ్రామ పంచాయితీలలో పని చేస్తున్న గ్రీన్ అంబాసిడర్ లకు ప్రతి నెలా జీతాలు చెల్లించుట లేదని, 2 నుండి 12 నెలల జీతాలు బకాయిలో ఉన్నాయని తెలిపారు. దీని మూలంగా కార్మికుల కుటుంబాలు పస్తులతో గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. కావున తమరు వెంటనే స్పందించి బకాయి జీతాలు చెల్లించేటట్లు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జీవో నెం 68 జారీ చేసి 3 ఏళ్లు గడుస్తున్నా దాని ప్రకారం జీతాలు ఎక్కడా అమలు చేయడం లేదని, ఈ కార్మికులంతా దళితులు, గిరిజనులు మరియు బలహీన వర్గాలకు చెందిన వారని వాపోయారు. గ్రీన్ అంబాసిడలర్లను పంచాయితీలకు అప్పచెప్పుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న, దీనివల్లన పంచాయితీల నుండి జీతాలు చెల్లించలేమని పంచాయితీ సర్పంచులు చెబుతున్నారని అన్నారు. కొంత మంది సర్పంచ్లు 1000 రూపాయలకు లేదా 1500 రూపాయలకు పనిచేయండి లేకపోతే మనేయండని చెబుతున్నారని, ఈ వైఖరి సరైనది కాదని మండిపడ్డారు. నెలల తరబడి జీతాలు లేకపోవడం వలన ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్యపరమైన సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు RTC, కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్, విద్యా, వైద్యం ధరల భారాలతో కుటుంబాలు అవస్థలు పడుతున్నారాని, 680 జీఓ ప్రకారం జీతాలు చెల్లించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, గ్రీన్ అంబసిడర్స్ పెండింగు జీతాలు చెల్లించాలని, గ్రీన్ అంబసిడర్స్ కి 10 వేల జీతం ఇవ్వాలని, గ్రీన్ అంబసిడర్స్ కు మాస్కులు, సెనిటేజర్, యూనిఫాం, గుర్తింపుకార్డులు ఇవ్వాలని, రీక్షలు రిపేర్లు చేయించాలని, గ్రూప్ ఇన్సురెన్స్ చేయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బి.సూరిబాబు, పి.రాజశేఖర్ మరియు కార్మికులు హెచ్. రాజేంద్ర, పి.కూర్మయ్య, ఎం. పైడయ్య, ఎం.చంటి, జి.రాము, పి.తిరుపతిరావు, ఎం.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

➡️