భద్రతే భరోసా !

Jan 24,2024 07:10 #Editorial
  • నేడు జాతీయ బాలికల దినోత్సవం

              అనాదిగా మన దేశంలో ఆడపిల్లలంటే చిన్న చూపు ఉంది. కాని మాటల్లో, ఆధ్యాత్మిక గ్రంథాల్లో మాత్రం మహిళలే ఈ జగత్తుకు ఆధారమని చెబుతారు. వాస్తవంగా చూస్తే దీనికి విరుద్ధంగా కుటుంబ స్థాయి నుంచి వివక్షత కొనసాగుతూనే ఉంది. చదువు, ఆస్తి, ఆర్థిక విషయాలలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు సమ ప్రాధాన్యత లేదు. కొన్ని కుటుంబాల్లో ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్‌ చేయించడం ఇప్పటికీ జరుగుతున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతీ 1000 మంది పురుషులకు 919 మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, నేటికీ ఆ లక్ష్యం సాధించలేకపోవడం గమనార్హం.

ముఖ్యంగా మన దేశంలో ఆడపిల్లలు అనేక వివక్షతలు ఎదుర్కొంటున్నారు. ఎన్నో చట్టాలు ఉన్నా, రక్షణ కల్పించలేక పోవడం బాధాకరం. గత 2023 ఒక్క సంవత్సరంలోనే 1.20 కోట్ల బాల్య వివాహాలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉన్నత విద్య అభ్యసించకుండా, అనేక లక్షల మంది బాలికలు డ్రాప్‌ అవుట్‌ అవుతున్నారు. ఉన్నత విద్య, కళాశాల విద్య అమ్మాయిలకు ఆమడదూరంలో ఉన్నది. కస్తూరిబా గాంధీ, బాలికల, మహిళా పాఠశాలలు ఏర్పాటు చేసినా, వీటిలో సరైన సదుపాయాలు, ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల చదువుకు దూరం అవుతున్నారు. మన రాష్ట్రంలో మెర్జింగ్‌ పేరుతో ప్రాథమిక పాఠశాలలను హై స్కూల్‌లో విలీనం చేయడం ద్వారా అనేక మంది బాలికలు డ్రాప్‌ అవుట్‌ అయ్యి, ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్‌ పడిపోవడానికి కారణం అవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి.

దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో అమ్మాయిలకు కనీసం ”టాయ్ లెట్‌” సౌకర్యాలు లేని పాఠశాలలు కోకొల్లలని గణాంకాలు చెబుతున్నాయి. పేదరికం కారణంగా చాలామంది అమ్మాయిలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. చిన్నతనంలోనే అమ్మాయిలు బాలకార్మికలుగా మారిపోతున్నారు. ఇంటి పనుల్లో, కుటుంబ పోషణకై పనిమనుషులుగా మారిపోతున్నారు. అసంఘటిత రంగంలో, భవన నిర్మాణంలో, ఇటుక బట్టీిల్లో ఎక్కువగా అమ్మాయిలు పనిచేస్తున్నారు. పని ప్రదేశాల్లో సౌకర్యాలు లేవు. భద్రత లేదు. లైంగిక వేధింపులకు, దాడులకు గురవుతున్నారు. అక్రమ రవాణాకు గురవుతున్నారు. పోక్సో చట్టం, బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, నేటికీ ప్రతీరోజూ పదుల సంఖ్యలో బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.

2008 నుంచి బాలికల రక్షణ కోసం జాతీయ బాలికల దినోత్సవం జరుపుతున్నాం. పాలకులు పైకి బేటీ బచావో-బేటీ పఢావో అంటున్నా చిత్తశుద్ధి లేకపోవడంతో పరిస్థితిలో మార్పు రావడం లేదు. బాలికలకు భరోసా కలుగడంలేదు. ఇకనైనా పాలకుల, కుటుంబ సభ్యుల ముఖ్యంగా మగవారి ”మైండ్‌ సెట్‌” మారాలి. బాలురతో సమానంగా అమ్మాయిలకు అన్నింటా సమాన హక్కులు కలుగచేయాలి. నాణ్యమైన విద్య అందించాలి. సమాన అవకాశాలు కల్పించాలి. సమాన వేతనాలు అందించాలి. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు విడనాడాలి. ప్రభుత్వాలు కూడా బాలికల రక్షణ కోసం మరెన్నో నూతన పథకాలు ప్రవేశపెట్టాలి. శాస్త్రీయ దృక్పథం పెరగాలి. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాలికా విద్యకు, భద్రతకు చర్యలు చేపట్టాలి. చట్టాలు సక్రమంగా అమలు చేయాలి. ర్యాగింగ్‌ భూతాన్ని తరిమి కొట్టాలి. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, మీడియా, పోలీసు, న్యాయ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలి.

మన దేశంలో కూడా పురుషులతో సమానంగా మహిళలు, బాలికలు భాగస్వామ్యం అన్ని రంగాల్లో పెరగాలి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో బాలికల పాత్ర కూడా ఉందని అందరూ గ్రహించాలి. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ చెప్పినట్లు ”ఒక దేశ అభివృద్ధి, ఆ దేశ మహిళల అభివృద్ధి పైనే ఆధారపడి ఉంటుంది” అన్న మాటలు మరువరాదు. భారత్‌ అభివృద్ధి బాలికల అభ్యున్నతిపైనే ఆధారపడి ఉందని పాలకులు, ప్రజలు గ్రహించాలి. – ఐ. ప్రసాదరావు

➡️