స్వాతంత్య్ర పోరాటంలో త్యాగధనులు

Jan 26,2024 07:03 #Editorial

నిజాలకు మసిపూసి మారేడు కాయలు చేయడం ఎంత మాత్రమూ దేశభక్తి కాదని చెప్పాల్సి ఉంది. నిజాల్ని నిర్భయంగా చెపుతూ ఉండడమే, ప్రచారంలో ఉంచడమే అన్నింటినీ మించిన దేశభక్తి. మతానికీ దేశభక్తికి సంబంధం లేదు. ఏదో ఒక మతస్థులే దేశభక్తులని, ఇతర మతస్థులంతా దేశ ద్రోహులని-ఈనాటి పాలకులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలంతా సమైక్యంగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది.

           భారత స్వాతంత్య్ర పోరాటం కోసం ముస్లింలు చేసిన త్యాగాలు దాచేస్తే దాగేవి కావు. ఒక్కసారి చరిత్రలోకి తొంగిచూసిన వారికి నిజాలు అవగతమౌతాయి. ”భారత స్వాతంత్య్రం ముస్లింల రక్తంతో రాయబడిందని, ముస్లింల జనాభా కన్నా, స్వాతంత్య్ర పోరాటంలో వారి భాగస్వామ్య శాతం ఎక్కువనీ”- ప్రఖ్యాత జర్నలిస్ట్‌ కుష్వంత్‌ సింగ్‌ నిర్ధారించారు. తన రాజ్యం తన దత్త పుత్రునికే సంక్రమించాలన్న పట్టుదలతో ఝాన్సీరాణి బ్రిటీష్‌ వారిపై యుద్ధం ప్రకటించిందని మనం చరిత్రలో చదువుకున్నాం. కానీ, అంతే విరోచితంగా పోరాడిన బేగం హజ్రత్‌ మహల్‌ (అవథ్‌ రాణి)-చరిత్రలో ప్రాధాన్యత సంతరించుకోలేదు. ఇది అన్యాయం! 1857 జూన్‌ 30న ప్రప్రథమ స్వాతంత్య్ర పోరాటంలో చిన్‌హట్‌ వద్ద బ్రిటీష్‌ పాలకుడు సర్‌ హెన్రీ లారెన్‌ను తుపాకీతో చంపి, బ్రిటీష్‌ సైన్యాన్ని చిత్తు చిత్తుగా ఓడించిన బేగం హజ్రత్‌ మహల్‌ను ఎందుకు కీర్తించగూడదూ? ఆమె, కేవలం ముస్లిం మహిళ అయినందుకేనా? ఆమె చూపిన తెగువకూ, శౌర్యానికీ విలువే లేదా? మనిషి విలువను మనిషే గుర్తించక పోతే ఎలా? సమాజాన్ని అంతటి హీన స్థాయికి దిగజార్చింది ఎవరూ? వారిని మనుషులనే అందామా?

భారత స్వాతంత్య్ర పోరాటం కోసం ముస్లింలు తమ మసీదులను యుద్ధ స్థావరాలుగా ఉపయోగిం చారు. ఉత్తరప్రదేశ్‌లో ఒక మసీదులో ఒక ఇమామ్‌ స్వాతంత్య్ర పోరాటం గురించి ప్రసంగిస్తూ ఉండగా బ్రిటీష్‌ సైన్యం మసీదులో ఉన్న వారిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపింది. అప్పుడు చిందిన ఆ స్వాతంత్య్ర సమరయోధుల నెత్తుటి మరకలు ఇప్పటికీ మనం ఆ మసీదు గోడలపై చూడొచ్చు. ముస్లింలు భారతదేశాన్ని సుమారు 300 ఏళ్లు పరిపాలించారు. ఇక్కడే బతికారు. ఇక్కడే మరణించారు. ఇది తమ స్వంత నేల అనుకున్నారు. అంతేగాని, ఇక్కడి నుంచి వారు ఏదీ కొల్లగొట్టుకుని పోలేదు. అలా కొల్లగొట్టుకుని పోయే పని బ్రిటీష్‌ వారు చేశారు. డచ్‌ వారు, ఫ్రెంచ్‌ వారు చేశారు. నిజాయితీపరులు రాసిన చరిత్ర చదివితే నిజాలు తెలుస్తాయి. మొఘలులు ఇక్కడి చిన్న చిన్న రాజ్యాలను ఐక్యం చేసి, విశాలమైన ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. విద్య, సాహిత్యం, కళలు, భవన నిర్మాణ రంగాల్లో దేశాన్ని తలమానికం చేశారు. న్యాయ, రాజకీయ, పరిపాలనా నిర్వహణ వ్యవస్థల్ని అభివృద్ధి చేశారు.

న్యూఢిల్లీ లోని ఇండియా గేట్‌ మీద 95,300 మంది సమర యోధుల పేర్లు రాస్తే, అందులో 61,945 పేర్లు ముస్లిం యోధులవే! ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఇందులో గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుల, వ్యాపార దిగ్గజాల పూర్వీకుల పేర్లు ఎవరివీ లేవు! తమిళనాడులో ఇస్మాయిల్‌ సాహెబ్‌-మరుదా నాయగం అనే ఇద్దరు వ్యక్తులు బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా నిరంతరం ఏడు సంవత్సరాలు పోరాడారు. చివరికి వారి పేరు వింటేనే బ్రిటీష్‌ వారికి చెమటలు పట్టేవి. బ్రిటీష్‌ వారు అంతగా హడలెత్తి పోయారు.

భారత స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా, బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఓడ నడిపిన మొట్టమొదటి నావికుడు-కప్పలో తియ తమిల్‌ జన్‌. ఇతని గురించి కొంత మందికి తెలిసి ఉంటుంది. కానీ, అతను నడిపిన ఓడను విరాళంగా ఎవరిచ్చారో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అంత విలువైన ఓడను దేశం కోసం విరాళంగా ఇచ్చింది ఫకీర్‌ మహ్మద్‌ రౌథర్‌. ఇకపోతే, ఈ కప్పలో తియ తమిల్‌ జన్‌ అరెస్ట్‌ అయినప్పుడు, అతణ్ణి విడుదల చేయాలని ఒక స్వాతంత్య్ర సమర యోధుడు ధర్నా చేశాడు. అతని పేరు మహ్మద్‌ యాసీన్‌. ధర్నా చేసినందుకు మహ్మద్‌ యాసీన్‌ను బ్రిటీష్‌ సైనికులు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. పోరాటంలో ప్రాణాలు త్యాగం చేయటం ముస్లిం యోధులకు తెలుసు. వారికి ఎవరూ దేశభక్తి గురించి ఉపన్యాసాలిచ్చే అవసరం లేదు. తిరుప్పుర్‌ (కోడికట) కుమారన్‌ స్వాతంత్య్ర పోరాటంలో అరెస్టయ్యాడు. ఆయనతో పాటు, అబ్దుల్‌ లతీఫ్‌, అక్బర్‌ అలీ, మొహిద్దీన్‌ ఖాన్‌, అబ్దుల్‌ రహీం, వావు సాహెబ్‌, (మరో) అబ్దల్‌ లతీఫ్‌, షేక్‌ బాబా సాహెబ్‌-అనే మరో ఏడుగురు స్వాతంత్య్ర యోధులు కూడా అరెస్టయ్యారు.

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ‘ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ’ని తయారు చేశాడని అందరికీ తెలుసు, కానీ, అందులో ముఖ్య భూమికను పోషించిన కమాండర్లు-ఆఫీసర్లు అంతా ముస్లింలేనన్నది చాలా కొద్ది మందికే తెలుసు. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలో ఉన్న పందొమ్మిది మంది ముఖ్యమైన కమాండర్లలో – అయిదుగురు ముస్లింలే. అందులో మన హైద్రాబాద్‌కు చెందిన ఆబిద్‌ హుస్సేని సఫ్రానీ ముఖ్యుడు. ఎందుకంటే, ‘జై హింద్‌’ నినాదాన్ని రూపొందించింది ఆయనే. సఫ్రానీ-అంటే కాషాయ రంగు. హిందువుల కాషాయాన్ని తన పేరు చివర చేర్చుకుని పరమత సహనానికి ఒక నిర్వచనంగా నిలిచిన వాడాయన! నేటి కుహనా దేశ భక్తులు ‘జై హింద్‌’ వాడుకుంటారు. కానీ, అది రూపొందించిన వాణ్ణి గుర్తించరు. పైగా ముస్లింల ఇళ్ళ పైకి డబులింజన్‌ బుల్‌డోజర్లు తోలుతారు? అదేం దేశ ప్రేమ? నేతాజీ ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలో చీఫ్‌ కమాండరే ఒక ముస్లిం! ఆయన పేరు షా నవాజ్‌ ఖాన్‌ !!

మోమన్‌ అబ్దుల్‌ హబీబ్‌ యూసుఫ్‌ మార్ఫానీ అనే అతను తన యావదాస్తి నేతాజీ ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీకి దానం చేశాడు. ఆ రోజుల్లోనే ఆ ఆస్థి విలువ కోటి రూపాయల కన్నా ఎక్కువ. ఇప్పటి లెక్కల్లో అయితే ఎన్ని బిలియన్లవుతాయో? ఆ రోజుల్లోనే యం.కె.యం. అమీర్‌ హంజా ఎన్నో లక్షల రూపాయలు నేతాజీ ఆర్మీకి విరాళంగా ఇచ్చాడు. ఆయన కుటుంబీకులు తర్వాత కాలంలో నిరుపేదలుగా బతికారు. తమిళనాడు -రామనాథపురంలో చిన్న అద్దె ఇంట్లో నానా యాతనా అనుభవించారు. బీవమ్మ – అనే ఒక ముస్లిం తల్లి బిడ్డల కోసం దాచిపెట్టకుండా తనకున్న ముప్పయి లక్షల రూపాయల ఆస్థిని భారత స్వాతంత్య్ర పోరాటం కోసం విరాళంగా ఇచ్చింది. వీరివి త్యాగాలు కావు. వీరిది దేశభక్తి కాదు. వీరిని వీరి త్యాగ నిరతిని ఎవరూ గుర్తుచేసుకోగూడదు. హిందూత్వ పేరుతో ఈ రోజుల్లో ‘జై శ్రీరామ్‌’ నినాదాలిచ్చే వారిదే దేశభక్తి. వారే దేశ ప్రేమికులు. మనం వాళ్ళలో చేరి చెవుల్లో కమలాలు పెట్టుకుంటేనే మన ప్రాణలకు రక్షణ ఉంటుంది మిత్రో-

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఈ దేశంలో పుట్టిన గొప్ప మేధావి. స్వాతంత్య్ర పోరాట కాలంలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో సీనియర్‌ ముస్లిం నాయకుడు. గాంధీజీతో పాటు సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నవాడు. ఆ ఉద్యమంలో ఉన్న 19 మందిలో 10 మంది ముస్లింలే. తర్వాత కాలంలో స్వతంత్య్ర భారతదేశంలో తొలి విద్యామంత్రి అబుల్‌ కలాం ఆజాదే! సెక్యులరిజం స్థాపన కోసం, దేశంలో హిందూ-ముస్లింల ఐక్యత కోసం అహరహం కృషి చేశారు.

హిందూ మత దురభిమానులు, జాత్యహంకారులు చాలా నిజాల్ని దాచేస్తున్న తరుణంలో- వాస్తవాల్ని వక్రీకరిస్తున్న తరుణంలో-వచ్చే తరాలకు నిజాలు తెలియకుండా పాలకులే కుట్రలు చేస్తున్న తరుణంలో- బాధ్యతగల పౌరులంతా వివేకంతో వ్యవహరించాల్సి ఉంది. నిజాలకు మసిపూసి మారేడు కాయలు చేయడం ఎంత మాత్రమూ దేశభక్తి కాదని చెప్పాల్సి ఉంది. నిజాల్ని నిర్భయంగా చెపుతూ ఉండడమే, ప్రచారంలో ఉంచడమే అన్నింటినీ మించిన దేశభక్తి. మతానికీ దేశభక్తికి సంబంధం లేదు. ఏదో ఒక మతస్థులే దేశభక్తులని, ఇతర మతస్థులంతా దేశ ద్రోహులని-ఈనాటి పాలకులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలంతా సమైక్యంగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది.

/ వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్‌ నుంచి)/డా|| దేవరాజు మహారాజు
/ వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్‌ నుంచి)/డా|| దేవరాజు మహారాజు
➡️