ఓటు అడిగే అర్హత పాలకపార్టీలకు లేదు

Apr 23,2024 21:58

ప్రజాశక్తి-విజయనగరం కోట: దేశంలోనూ, రాష్ట్రంలోనూ పాలకవర్గాలు ప్రజలను ఓటు అడిగే అర్హత కోల్పోయాయని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.కామేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ విజయనగరం కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి బొబ్బిలి శ్రీను అన్నారు. మంగళవారం ఒక ప్రైవేటు హౌటల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ స్వభావాన్ని కాపాడుకోవడానికి ఇండియా కూటమి పోరాటం చేస్తుందన్నారు పదేళ్ల మోడీ పాలనలో దేశ సంపదను కార్పొరేట్లకు అమ్మేస్తూ, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ప్రజల జీవనాన్ని విచ్ఛన్నం చేసిందని అన్నారు. మతాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య గొడవలు సష్టించడమే వారి ప్రధాన కర్తవ్యమన్నారు. రానున్న రోజుల్లో భారతదేశాన్ని ఒక హిందువు రాజ్యంగా చేయాలని భావిస్తోందన్నారు. ఉత్తరాంధ్రకు తలమానికమైన స్టీల్‌ప్లాంట్‌ను కార్పొరేట్‌శక్తులకు కట్టబెట్టేందుకు మోడీ ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఈనేపథ్యంలో దేశంలోని బిజెపి ప్రభుత్వాన్ని, దానితో జతకట్టిన టిడిపి, జనసేన, మద్దతిస్తున్న వైసిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. కామేశ్వరరావు మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అనేకమైన మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రజలను మభ్యపెట్టి దేశాన్ని మతతత్వంగా మారుస్తున్నాడని అన్నారు. నిజాయితీగా పాలనందిస్తున్న కేరళ ముఖ్యమంత్రిపైనా, ఢిల్లీ ముఖ్యమంత్రిపైనా విష ప్రచారం చేస్తున్నాడని అన్నారు. ఇంకా అనేక చట్టాలను తెచ్చి ప్రజలు నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు ఇండియా కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ గత ఎన్నికల్లో గెలిచిన బెల్లాన చంద్రశేఖర్‌ విజయనగరం జిల్లా సమస్యలపై ఒక్కరోజైనా పార్లమెంట్లో నోరు విప్పారా అని ప్రశ్నించారు. విజయనగరం పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బొబ్బిలి శ్రీను మాట్లాడుతూ దేశంలో నియంత పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను విద్య, వైద్యం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు నామినేషన్‌ వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు నాయకులు, అభిమానులు ప్రజలు వేలాదిగా తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు, నెల్లిమర్ల అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి డోల శ్రీనివాస్‌, విజయనగరం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు శనపతినేటి శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు.

➡️