సామాజిక భద్రత కల్పించని పాలకులు

Dec 10,2023 07:17 #Editorial

సామాజిక పెన్షన్లను కనీసంగా రూ.10,000కు పెంచటానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం…అదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ సంపన్నులపై పన్నులు వేసి సేకరించాలి. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ విధానం అమలు చేసే విధంగా ఇప్పటి నుండే ఒత్తిడి చేయాలి. సామాజిక పెన్షన్లను కేవలం దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నవారికి మాత్రమే పరిమితి చెయ్యడం సరికాదు. బిపిఎల్‌ అయినా, ఎపిఎల్‌ అయినా దానితో సంబంధం లేకుండా శ్రామికులందరికీ వృద్ధాప్యంలో పెన్షన్‌ ఇవ్వాలి. ఆదాయ పరిమితి పేరుతో కుటుంబంలో సభ్యులుగా ఉండి ఇతర వృత్తులు చేసుకున్నవారికి ఇవ్వకపోవడం సరికాదు.

             వ్యవ్యవసాయ కార్మికులు, రైతులు, అసంఘటిత కార్మికులు, ఉద్యోగులు…ఆదాయాలు, వేతనాల సమస్యను ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్యంలో పనులు, ఉద్యోగాలు చేయలేని సమయంలో వీరిని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరిస్తున్నాయి. పైగా అది తమ పని కాదని, వారి కుటుంబాలే చూసుకోవాలని వాదిస్తున్నాయి.

సామాజిక పెన్షన్లు

వృద్ధులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు ఉచితంగా ఇచ్చేవి కావు. 30, 40 సంవత్సరాలు సమాజానికి సేవ చేసినందుకు ప్రభుత్వం బాధ్యతగా ఇచ్చేవి. వాటికి కానుకలుగా పేరుపెట్టడం సమంజసం కాదు. వై.ఎస్‌.ఆర్‌, ఎన్‌.టి.ఆర్‌, ఇందిరమ్మ పేర్లతో వాటిని పిలవడం పెన్షనర్లను తమ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవటానికే. వారిని ఆ విధంగా చిన్న చూపు చూడడం ప్రభుత్వాల బాధ్యాతారాహిత్యం. నెలకు రూ.2750 పెన్షన్‌గా ఇచ్చి చేతులు దులుపుకునే చర్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ఇవి ఎవరి జేబులో నుండి సొంతగా ఇచ్చేవి కావు. ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులలో భాగంగా వచ్చేవి. పెన్షన్‌ పొందటాన్ని పెన్షనర్ల ప్రాథమిక హక్కుగా ఉన్నత న్యాయస్థానం గుర్తించింది. రాజ్యాంగం ప్రకారం కూడా జీవించే హక్కులో భాగంగా పెన్షన్‌ హక్కు ఉంటుంది.

అందరితో ఉంటాం, అందరి శ్రేయస్సు కోసం పని చేస్తామని చెప్పుకునే మోడీ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్లకు కేవలం నెలకు రూ.200 మాత్రమే ఇస్తోంది. 80 సంవత్సరాలు, ఆపైన వయస్సు ఉన్నవారికి మాత్రమే రూ.500 చొప్పున కేటాయిస్తోంది. మిగతా భారం అంతా రాష్ట్ర ప్రభుత్వాలపై నెడుతోంది. సామాజిక పెన్షన్లను కనీసం రూ.10,000 చేయాలని కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు మోడీి ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

సామాజిక పెన్షన్లను కనీసంగా రూ.10,000కు పెంచటానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం… అదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ సంపన్నులపై పన్నులు వేసి సేకరించాలి. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ విధానం అమలు చేసే విధంగా ఇప్పటి నుండే ఒత్తిడి చేయాలి. సామాజిక పెన్షన్లను కేవలం దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నవారికి మాత్రమే పరిమితి చెయ్యడం సరికాదు. బిపిఎల్‌ అయినా, ఎపిఎల్‌ అయినా దానితో సంబంధం లేకుండా శ్రామికులందరికీ వృద్ధాప్యంలో పెన్షన్‌ ఇవ్వాలి. ఆదాయ పరిమితి పేరుతో కుటుంబంలో సభ్యులుగా ఉండి ఇతర వృత్తులు చేసుకున్నవారికి ఇవ్వకపోవడం సరికాదు.

ఇపిఎస్‌ పెన్షన్లు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగం, ప్రైవేటు సంస్థలలో పని చేస్తూ ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ చందాదారులుగా వున్న ప్రతి ్‌ఒక్కరికీ పని నుండి దిగిపోయిన తరువాత వృద్ధాప్యంలో ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీం కింద పెన్షన్లు వస్తాయి. ఈ స్కీం కింద ఉండే పెన్షన్‌ నియమాల ప్రకారం చాలా తక్కువ పెన్షన్‌ వస్తుంది. పెరిగిన ధరలకు నష్టపరిహారం (కరువు భత్యం) కూడా ఉండదు. జీతం పెద్ద స్థాయిలో వున్న వారికి కూడా పెన్షన్‌ చాలా తక్కువగా వస్తుంది.

కనీస పెన్షన్‌ను నెలకు 9 వేల రూపాయలకు పెంచాలని ఇపిఎస్‌ పెన్షనర్ల సంఘాలు అడుగుతున్నా మోడీ ప్రభుత్వం కదలడం లేదు. ప్రస్తుతం కనీస పెన్షన్‌ కేవలం వెయ్యి రూపాయలు. దీన్ని రెండు వేలకు పెంచుతారా? అని పార్లమెంట్‌ సభ్యులు అడిగితే మోడీ ప్రభుత్వం తన దగ్గర అంత డబ్బు లేదని, పెంచలేనని చెప్పింది. అదే సమయంలో ప్రతి సంవత్సరం కార్పొరేట్‌ కంపెనీల ఆదాయ పన్నులలో 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా రాయితీలు ఇస్తోంది.వాస్తవంగా కేంద్ర ప్రభుత్వానికి పైసా ఖర్చు గాకుండానే ఇపిఎస్‌ పెన్షనర్ల పెన్షన్‌ను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. కార్మికులకు చెందిన పి.ఎఫ్‌ డబ్బులలో కొంత భాగాన్ని పెన్షన్‌ ఫండ్‌కు తరలిస్తారు. 2023 మార్చి 31 నాటికి ఈ పెన్షన్‌ ఫండ్‌ నిల్వ రూ.7 లక్షల 80 వేల కోట్లు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఈ ఫండ్‌కు రూ. 1 లక్ష 17 వేల కోట్లు జమయ్యాయి. దీనిలో వడ్డీ రూపేణా వచ్చిన జమ ఒక్కటే రూ. 52 వేల కోట్లు. కానీ ఈ సంవత్సరంలో 75 లక్షల మంది పెన్షనర్లకు చెల్లించిన పెన్షన్‌ మొత్తం రూ.14 వేల కోట్లు మాత్రమే. అంటే సరాసరిన ఒక్కొక్కరికి నెలకు రూ. 1592 మాత్రమే చెల్లించారు. ఇది సామాజిక పెన్షన్ల కంటే కూడా చాలా తక్కువ.

పరిమితికి మించి వాస్తవ వేతనం మీద పి.ఎఫ్‌ కట్టిన చందాదారులకు పి.ఎఫ్‌ నిబంధనల ప్రకారం అధిక పెన్షన్‌ ఇవ్వాలి. కాని కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో దీన్ని చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయినప్పటికి మోడీ ప్రభుత్వం దాన్ని అమలు చెయ్యకుండా తాత్సారం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు కూడా కొందరికి చేదుగా, కొందరికి తీపిగా ఉండటం కూడా సహజ న్యాయానికి విరుద్ధం. ఈ తీర్పు ప్రకారం 2014కు ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, కార్మికులకు అధిక పెన్షన్‌ వర్తించదు. 2014 సెప్టెంబర్‌ 1 నాటికి సర్వీసులో కొనసాగుతున్న వారికి మాత్రమే సుప్రీం కోర్టు తీర్పు వర్తిస్తుంది. అత్యున్నత న్యాయస్థానం కూడా పాలక ప్రభుత్వాల ఒత్తిడికి లోనుకావడం పెన్షనర్లకు నష్టం చేసింది.

దాదాపు రూ. 8 లక్షల కోట్లు పెన్షన్‌ ఫండ్‌ నిల్వలు ఉన్నప్పటికీ పెన్షన్లు పెంచడానికి మోడీ ప్రభుత్వం ఎందుకు సిద్ధం కావడంలేదు? దానిలో సగం నిల్వను ఉపయోగించి పెన్షనర్లు కోరుతున్న విధంగా కనీస పెన్షన్‌ రూ. 9 లేదా 10 వేలు చెల్లించే అవకాశం ఉన్నా కూడా మోడీ ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తోంది ?

మోడీ ప్రభుత్వం ఇపిఎస్‌ పెన్షన్‌ స్కీంను మార్చాలనే ఆలోచనలో ఉంది. పెన్షన్‌ ఫండ్‌ మొత్తాన్ని విదేశీ పెట్టుబడుల సేవకు మరియు అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్‌ సంస్థల వాటాల విలువలను పెంచేందుకు ఉపయోగించాలని చూస్తోంది. మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్‌ కోడ్‌లలో సామాజిక భద్రతా కోడ్‌ ఒకటి. 2024 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ఈ కోడ్‌ అమలు లోకి వస్తుంది. దీని ప్రకారం పెన్షన్‌ స్కీంలో మోడీ ప్రభుత్వం మార్పులు చేస్తుంది. పార్లమెంట్‌ ఆమోదం కూడా అవసరం లేదు. కార్మికుల నిధి రూ.8 లక్షల కోట్లు జూదపూరిత షేర్‌ మార్కెట్‌కు తరలిపోతాయి. కార్మికులకే చెందిన ఈ నిధి మొత్తం కార్మికులకే ఉపయోగపడాలంటే మోడీ తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలి. కొత్త ప్రభుత్వం ఏదైనా సరే కార్మికులకే ఈ నిధిని ఉపయోగపెట్టేలా ఆందోళనలు చెయ్యాలి. దీనికి ఎన్నికలే మంచి సమయం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలలో పని చేసే పర్మినెంట్‌ ఉద్యోగులు, అందులో 2004కు ముందు సర్వీసులో చేరిన వారికి మాత్రమే మెరుగైన పాత పద్ధ్దతిలో పెన్షన్‌ వస్తుంది. 2004 జనవరి, సెప్టెంబర్‌ నెలలు మరియు ఆ తరువాత చేరిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు పెన్షన్లు తీసివేశారు. 2010 ఏప్రిల్‌ 1 మరియు ఆ తరువాత చేరిన బ్యాంకు, ఇన్సూరెన్స్‌ ఉద్యోగులకు కూడా పెన్షన్లు లేవు. కార్పొరేషన్లుగా మారిన తరువాత చేరిన బిఎస్‌ఎన్‌ఎల్‌, విద్యుత్‌ కార్పొరేషన్ల ఉద్యోగులకు పెన్షన్లు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి ఖాతాలలో చెల్లించిన జమల నుండి పదవీ విరమణ తరువాత నూటికి రూ.40 ఎటువంటి గ్యారంటీ లేని మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలి. వాటికి ఏమైనా ఆదాయం అంటూ వస్తే దాన్నే పెన్షన్‌ కింద లెక్కేసుకొని సరిపెట్టుకోవాలి. బ్యాంకు, బీమా ఉద్యోగులకు కూడా అదే పరిస్థితి. బిఎస్‌ఎన్‌ఎల్‌, విద్యుత్‌ కార్పొరేషన్లలో చేరిన ఉద్యోగులకు అతి తక్కువగా ఉండే ఇపిఎస్‌ పెన్షన్లు మాత్రమే గతి.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీంను పునరుద్ధరిస్తామనే వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన వైసిపి తన వాగ్దానానికి తిలోదకాలు ఇచ్చింది. గ్యారంటీ పెన్షన్‌ స్కీంను కొత్తగా తెచ్చింది. ఈ స్కీంను ఎంపిక చేసుకున్నవారు తమ ఖాతాలలో జమ అయ్యే నూటికి నూరు రూపాయలను మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలి. ఇంటికి తీసుకుపోయేదేమీ ఉండదు. ఎటువంటి గ్యారంటీ లేని మార్కెట్‌ ఆదాయం ఏమైనా తను చెప్పిన దానికంటే తక్కువ పడితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది కూడా గ్యారంటీ ఉండదు. ఎప్పుడైనా సరే తాను చెల్లించే భాగాన్ని ఉపసంహరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్యారంటీ పెన్షన్‌ స్కీంలో గ్యారంటీని లేకుండా చేసింది.

అంతా ఐక్యం కావాలి

శ్రామికులందరికి పెన్షన్లు లేకుండా చేసి అన్ని తరగతులనూ ఐక్యం చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదే! సామాజిక, ఇపిఎస్‌, సిపిఎస్‌, జిపిఎస్‌ పెన్షనర్లంతా ఐక్యం కావాలి. పెద్ద ఎత్తున పోరాటాలు చేసి తమకు వ్యతిరేకమైన పాలకుల విధానాలను తిప్పి కొట్టి వృద్ధాప్యంలో ఉన్న శ్రామికుల కుటుంబాలకు పూర్తి రక్షణ కల్పించే విధానాలను అమలు చేయించుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే తాము సృష్టించిన సంపదలో తమ వాటాను దక్కించుకునేలా పెన్షనర్లు భారీ పోరాటాలతో పాలకులపై ఒత్తిడి తేవాలి.

/ వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు / పి. అజయ కుమార్‌
/ వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు / పి. అజయ కుమార్‌
➡️