పర్యాటకుల పెంపు కోసం భారత్‌లో రోడ్‌ షోలు !

Apr 12,2024 23:09 #Maldives, #Tourism Organization

మాల్దీవుల పర్యాటక సంస్థ ఆలోచన
న్యూఢిల్లీ : భారత్‌, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో మాల్దీవుల్లో పర్యటించే భారత పర్యాటకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ తరుణంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు మాల్దీవులకు చెందిన పర్యాటక సంస్థ ముందుకొచ్చింది. భారత పర్యాటకులను ఆకర్షించేందుకు భారతదేశ నగరాల వ్యాప్తంగా రోడ్‌ షోలను నిర్వహించనున్నట్లు మాల్దీవులకు చెందిన ప్రధాన పర్యాటక సంస్థ ప్రకటించింది. లక్షదీవుల్లో పర్యటిస్తూ ప్రధాని మోడీ మాల్దీవులతో లక్షద్వీప్‌ను పోల్చారు. అక్కడకువెళ్ళే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఆ వెంటనే మాల్దీవులు అధ్యక్షుడు, మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు మోడీపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో మాల్దీవులను పూర్తిగా బహిష్కరించే కార్యక్రమం సాగింది.
ఈ నేపథ్యంలో మాల్దీవ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ట్రావెల్‌ ఏజెంట్స్‌ అంట్‌ టూర్‌ ఆపరేటర్స్‌ (ఎంఎటిఎటిఓ) ఈ నెల 8న మాలెలో భారత హై కమిషనర్‌తో చర్చలు జరిపింది. రాబోయే మాసాల్లో మాల్దీవులకు మీడియా ట్రిప్‌లకు కూడా అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. భారత్‌వ్యాప్తంగా ప్రముఖ పర్యాటక సంస్థలతో, పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

➡️