ఆహారేతర వస్తువులపై పెరుగుతున్న వ్యయం

Feb 26,2024 10:45 #non food items, #rising

కలవరపెడుతున్న అద్దెలు

న్యూఢిల్లీ : దేశంలో గత 20 సంవత్సరాల కాలంలో ఆహార వ్యయంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆహారంపై తక్కువ ఖర్చు చేయడమంటే మిగిలిన వస్తువుల కొనుగోలుపై ఎక్కువ ఖర్చు చేయడమే. నాణ్యమైన వినియోగ వస్తువుల నుండి బట్టలు, చెప్పుల కొనుగోలు వరకూ, వాహనాలలో పెట్రోల్‌ లేదా డీజిల్‌ పోయించేందుకు, చివరికి వినోదంపై కూడా ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారట. 1999-2000 నుండి 2022-23 వరకూ గ్రామీణ, పట్టణ కుటుంబాలలో ఆహారంపై వ్యయం తగ్గుతూ వచ్చింది. గ్రామాలలో మొత్తం వినియోగ వ్యయంలో ఆహారంపై పెట్టే ఖర్చు 50 శాతం కంటే తక్కువగా, పట్టణాలలో 40 శాతం కంటే తక్కువగా ఉండడం ఇదే మొదటిసారి అని తాజాగా విడుదలైన కుటుంబ వినియోగ వ్యయ సర్వే తెలిపింది.

1999-2000లో గ్రామీణ ప్రాంతాలలో వినియోగ వ్యయంలో ఆహార వాటా అత్యధికంగా 59.4 శాతం ఉంది. నూతన సహస్రాబ్దిలోని తొలి దశాబ్దంలో అది 50 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో 46.38 శాతంగా రికార్డయింది. పట్టణ ప్రాంతాలలో సగటు నెలసరి తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ)లో ఆహార వాటా 48.06 శాతం (1999-2000) నుండి 39.17 శాతం (2022-23)కి తగ్గింది.

వరి, గోధుమలు వంటి ఆహార ధాన్యాలపై కాకుండా పౌష్టికాహారం కోసం భారతీయులు ఏ మేరకు ఖర్చు చేస్తున్నారో కూడా సర్వే పరిశీలించింది. 1999-2000లో గ్రామీణ కుటుంబాల మొత్తం వినియోగ వ్యయంలో ఆహారధాన్యాలపై పెట్టిన ఖర్చు 22 శాతంగా ఉంది. ఇప్పుడది దారుణంగా 4.91శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతాలలో ఈ ఖర్చు 12 శాతం నుండి 3.64 శాతానికి తగ్గిపోయింది. ఆసక్తికరమైన విషయమేమంటే గత రెండు దశాబ్దాలలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో గుడ్లు, చేపలు, మాంసం, పండ్లు, కూరగాయలపై ఖర్చు పెరుగుతోంది. అయితే ఇక్కడ ఆందోళన కలిగించే విషయం కూడా ఒకటుంది. పట్టణ ప్రాంతాలలోని కుటుంబాలు తమ ఆదాయంలో 2.43 శాతం పాన్‌, పొగాకు, మత్తు పదార్థాలపై ఖర్చు చేస్తు న్నాయి. వినోదంపై 1.58 శాతం దాకా ఖర్చు చేస్తున్నాయి.

గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అద్దెలపై పెట్టే ఖర్చు కూడా ప్రజలకు భారంగా మారుతోంది. గ్రామీణ ప్రజలు తమ ఆదాయంలో 0.78 శాతం, పట్టణ ప్రజలు 6.56 శాతం అద్దె రూపేణా చెల్లించాల్సి వస్తోంది.

➡️