రవాణా రంగ సమస్యలు పరిష్కరిస్తేనే ఓటు అడిగే హక్కు

  • ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించే వారికే డ్రైవర్ల ఓటు అడిగే హక్కు ఉంటుందని ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య అన్నారు. విశాఖపట్నం జగదాంబ సమీపంలోని సిఐటియు కార్యాలయంలో సోమవారం రవాణా రంగ కార్మికుల సదస్సు నిర్వహించారు. ప్రధాన వక్తగా లక్ష్మయ్య హాజరై మాట్లాడారు. రోడ్డు రవాణా డ్రైవర్లకు సామాజిక సంక్షేమ బోర్డు ఏర్పాటు, సెక్షన్‌ 106 (1,2), మోటారు ట్రాన్స్‌పోర్టు సవరణ చట్టం 2019, జిఒ 21 రద్దు, ఓలా, ఉబర్‌ తరహా ప్రత్యామ్నాయ యాప్‌ ఏర్పాటు, పెట్రోల్‌, డీజిల్‌లో పన్ను మినహాయింపు ఇస్తామని చెప్పే పార్టీలుకు మాత్రమే డ్రైవర్లను ఓటు అడిగే హక్కు ఉంటుందన్నారు. రవాణా రంగంలో అత్యధిక మంది ప్రయాణికులకు సేవలందించే వారిలో డ్రైవర్లది కీలకమని తెలిపారు. గతంలో ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణమైతే గరిష్టంగా రెండేళ్లు శిక్ష ఉండేదని, ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సెక్షన్‌ 106 (1) (2) ప్రకారం పదేళ్ల జైలు, రూ. ఏడు లక్షల జరిమానా విధించేలా నిబంధనలు తయారుచేసిందన్నారు. ఇప్పటివరకు ప్రమాదాలు జరిగిన వెంటనే స్టేషన్‌లోనే బెయిల్‌ తీసుకునే అవకాశం ఉండేదని, కొత్త చట్టంలోని నిబంధనల వల్ల కోర్టులో బెయిల్‌ కోసం ఎదురు చూడాల్సి వస్తుందని తెలిపారు. 2019లో జిఒ 21 మోటారు ట్రాన్స్‌పోర్టు చట్టంలో భారీగా జరిమానాలు పెంచినా ప్రమాదాలు తగ్గలేదు సరికదా 2022లో ప్రమాదాలు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయని తెలిపారు. ప్రమాదాలకు అసలు కారణాలను పరిష్కరించకుండా, శిక్షలు పెంచితే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పడం మోసగించడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వాలకు మోటారు కార్మికుల ద్వారా రూ.లక్షల కోట్ల వస్తున్నా, వారి సంక్షేమానికి ఎటువంటి చట్టమూ లేదన్నారు. డ్రైవర్లు ఏ విధమైన ప్రమాదానికి గురైనా ఆ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సహాయమూ అందడంలేదని తెలిపారు. డ్రైవర్లకు రక్షణ కల్పించేలా కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ రాష్ట్రాల తరహాలో సమగ్ర సంక్షేమ చట్టాన్ని చేయాలని, వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో విశాఖ జిల్లా మోటారు ట్రాన్స్‌ పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు బి జగన్‌, అధ్యక్ష, కార్యదర్శులు శివ, జి అప్పలరాజు, క్యాబ్‌ యూనియన్‌ నాయకులు శ్రీనివాస్‌, పోలినాయుడు మాట్లాడారు.

➡️