కాలంతో సవారీ

Feb 5,2024 08:23 #sahityam

కాలంతో పోటీపడటం అంత సులువు కాదు

కష్టాల కడలిలో చిక్కుకొని

అంతుచిక్కని పద్మవ్యూహంలో బందీ అయిపోయిన

మనిషి బతుకు అంతు చిక్కని రహస్యం.

మోసం చాటున నడుస్తున్న సమాజం

నేర్పుతున్న పాఠం బాగా కంఠస్తం అవుతుంది.

 

చెమట తడిసిన దేహంతో ఎన్నోసార్లు

నన్ను నేను ప్రశ్నించుకున్నాను

నన్ను నేను నిందించుకున్నాను

నన్ను నేను పరామర్శించుకున్నాను

మాయ మనుషుల మర్మం తెలిసినపుడు

నలుగురి మధ్యలో బతకడం అంటే ఇదే అని

నన్ను నేను ఓదార్చుకున్నాను.

 

ఆకాశమంత జీవితంలో నల్లని మేఘాలు

అల్లుకొని శూన్యపు చీకటిలో కొట్టుమిట్టాడుతుంటే

ఒంటరి నక్షత్రాన్నరు గుండెలో ధైర్యపు

వెలుగును నింపుకొని ప్రయాణించడం

అంత సులువేం కాదు

 

కాలంతో సవారీ చెయ్యడం ఒక సవాలే

ఓరకన్నుతో ఎక్కడో దాక్కుని చూస్తున్న

విజయానికి ఒక సవాల్‌ విసురుతున్న.

నువ్వు కష్టాల వర్షమై కురిసినా…

తుపానువై తన్నుకొస్తున్నా

ధైర్యాన్ని గొడుగుగా చేసుకొని వస్తాను.

సూర్యుడై వెలుగుతాను.

– అశోక్‌ గోనె 9441317361

➡️