పేదలకు మరింత చేరువగా ఆరోగ్యశ్రీ

Dec 19,2023 08:37 #ap cm jagan, #review
cm jagan visit srikakulam

కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో సిఎం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఆరోగ్య శ్రీ కుటుంబాన్ని పేదలకు మరింత చేరువ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచిన నేపథ్యంలో నూతన కార్డుల జారీ ప్రక్రియను సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాపతినిధులు, గ్రామ-వార్డు సచివాలయాల సిబ్బంది వీక్షించారు. సిఎం మాట్లాడుతూ వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్ధితి ఎవరికీ ఉండకూడదన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచడం చారిత్రాత్మకమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.48 కోట్ల కుటుంబాలను, 4.25 కోట్ల జనాభాను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. 4.25 కోట్ల జనాభాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చిన్నట్లు చెప్పారు. వెయ్యి రూపాయలు దాటి ఖర్చయ్యే ప్రొసీజర్లన్నింటిని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చామని పేర్కొన్నారు. గతంలో ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు 748 ఆస్పత్రులకు పరిమితంగా ఉండేవని, ఇప్పుడు 2,513 నెట్‌వర్క్‌ ఆసుత్రులకు విస్తరించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లకాలంలో రూ.5171 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం ఏడాదికి ఆరోగ్యశ్రీ, ఆరోగ్య అవసరాల కోసం రూ.4100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

  • పేదవాడికి అండగా ఆరోగ్య ఆసరా

వైద్యం చేయించడమే కాకుండా నయమయ్యే వరకూ నెలకు రూ.5 వేలు చొప్పున రెండు నెలలు అయితే నూ.10 వేలు పేదవాడి చేతిలో పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య ఆసరా కింద 25,27,870 మందికి రూ.1,309 కోట్లు చెల్లించామన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఈ ప్రభుత్వంలో 53,02,816 మంది చికిత్స తీసుకున్నారని చెప్పారు. గతంలో ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్‌ వంటి రోగాలకు రూ.5 లక్షల దాటితే ఇచ్చేవారు కాదని, కీమోథెరిపీ లాంటిది ప్రారంభిస్తే రెండు, మూడు డోసులకు రూ.5 లక్షలు అయిపోయేవన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత క్యాన్సర్‌ ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

➡️