పుట్టపర్తిలో ఆంక్షలు

విద్యాగిరి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

          పుట్టపర్తి అర్బన్‌ : ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కావడంతో పట్టణంలో పోలీసులు ఆంక్షలు విధించారు. గురువారం నుంచి నామినేషన్లు ప్రారంభం అయిన నేపథ్యంలో హనుమాన్‌ సర్కిల్‌ నుంచి విద్యాగిరి ఆర్టీసీ డిపో వరకు 144 సెక్షన్‌ను విధించారు. పట్టణంలో ఎలాంటి ర్యాలీలు ఎన్నికల వాహనాలు తిరగకుండా ఆంక్షలు విధించారు. విద్యాగిరి వద్ద ఆర్టీసీ డిపో రహదారిలో పోలీసులు గట్టి బందోబస్తు భద్రతా చేపట్టారు. ఆర్టీసీ బస్సులు పట్టణంలో బైపాస్‌ రోడ్డు నుంచి గంగమ్మ గుడి వరకు దారి మళ్లించారు. టిడిపి తరఫున పల్లె సింధూర నామినేషన్‌ వేనున్న సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పట్టణంలోనికి రాకుండా బైపాస్‌ రహదారిలో వెళ్లేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ డిపో దగ్గర నుంచి పట్టణంలోకి వెళ్లే ప్రయాణికులను క్షుణ్నంగా తనిఖీలు చేసి పంపారు. సిఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చేపట్టారు.

నామినేషన్‌ కేంద్రాల పటిష్ట బందోబస్తు : ఎస్పీ

          నామినేషన్‌ కేంద్రాల వద్ద పకడ్బందీగా పోలీస్‌ యంత్రాంగం విధులు నిర్వర్తించాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. గురువారం నాడు జిల్లా వ్యాప్తంగా, పుట్టపర్తి, హిందూపురం పెనుగొండ, ధర్మవరం, కదిరి, నామినేషన్‌ కేంద్రాల పోలీసులు పకడ్బందీగా బందోబస్తు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇదే రీతిలో నామినేషన్‌ ప్రక్రియ ముగిసేంతవరకు ఏర్పాట్లు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. పుట్టపర్తిలో అదనపు ఎస్పీ ఎన్‌.విష్ణు, నామినేషన్‌ కేంద్రం వద్ద నిర్వహిస్తున్న బందోబస్తును సమీక్షించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో వెళ్లేందుకు అభ్యర్థితో కలిపి ఐదుగురికి మాత్రమే అనుమతి ఇవ్వాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారుల ఉత్తర్వులు, ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎఆర్‌డి ఎస్‌పి విజరుకుమార్‌, డీఎస్పీలు వాసుదేవన్‌, కన్జాక్షన్‌, బాబ్జీ జాన్‌ సైదు, శ్రీలత, ఎస్‌బిఐ బాలసుబ్రమణ్యం రెడ్డి, సిఐలు కొండారెడ్డి, రాగిరి రామయ్య, రాజా రమేష్‌, తదితరులు భద్రతా సిబ్బందిలో పాల్గొన్నారు.

➡️