తొలగించిన చోటే స్థలాలివ్వండి 

Feb 29,2024 10:38 #cpm protest, #Tirupati
  • కలెక్టరేట్‌ ఎదుట పేదల ధర్నా

ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ : తిరుపతి నగరం కరకంబాడీ వద్ద ఎర్రగుట్టపై గుడిసెలను తొలగించిన చోటే స్థలాలివ్వాలని జిల్లా కలెక్టరేట్‌ ఎదుట పేదలు ధర్నా చేశారు. ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా వందలాది మంది రోడ్డుపై బైఠాయించారు. ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీలో స్థలాలు చూపించాలని నినాదాలు చేశారు. స్థలాలు చూపేంతవరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య మాట్లాడారు. ఏమి నేరం చేశారని పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేశారని, పేదల పక్షాన పోరాడుతున్న సిపిఎం నేతలను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. భూ కబ్జాదారుడైన సిద్ధులు రవిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.. కబ్జాదారులు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకొని పేదలకు ఇవ్వాలని కోరారు. అనంతరం డిఆర్‌ఒ పెంచల కిషోర్‌కి వినతిపత్రం అందజేశారు. డిఆర్‌ఒ మాట్లాడుతూ.. 15 రోజుల్లో పేదలకు స్థలాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పేదలు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి.సుబ్రమణ్యం, మాధవ్‌, జయచంద్ర, వందలాది మంది పేదలు పాల్గొన్నారు.

➡️