ముస్లిం వివాహాలు-విడాకుల చట్టం రద్దు – అసోం బిజెపి ప్రభుత్వ ఆమోదం

దిస్‌పూర్‌ : 1935వ సంవత్సరపు అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం రద్దుకు బిజెపి నేతృత్వంలోని అసోం ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి) అమలులో ఇది ముందడుగు అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. బాల్య వివాహాలను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని అసోం మంత్రి జయంత మల్లా బారువా చెప్పారు. ఇది వలస పాలకుల కాలం నాటి చట్టమని ఆయన అన్నారు. బాల్య వివాహాలను అడ్డుకోవడమే ఈ చట్టం రద్దు యొక్క ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ రాష్ట్రంలోని ముస్లిం కుటుంబాలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శకులు అంటున్నారు. యుసిసికి సంబంధించిన బిల్లును ఇప్పటికే ఉత్తరాఖండ్‌ ఆమోదించగా, గుజరాత్‌ త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు బిల్లును సిద్ధం చేసింది. భారతీయ ముస్లింల ప్రాథమిక హక్కులను యుసిసి ఉల్లంఘిస్తోందని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సహా పలువురు నేతలు ఆరోపించారు.

➡️