మోడీని తిరస్కరించండి : కమల్‌ హాసన్‌

చెన్నయ్ : దేశాన్ని పరిపాలించేందుకు బిజెపికి, ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి అవకాశం ఇవ్వవద్దని మక్కల్‌ నిధి మయం (ఎంఎన్‌ఎం) వ్యవస్థాపకులు, ప్రఖ్యాత సినీ నటుడు కమల్‌ హసన్‌ తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు. చిదంబరం పార్లమెంటరీ నియోజవర్గం నుండి ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విసికె అధ్యక్షులు తోల్‌ తిరుమవలవన్‌కు మద్దతుగా ఆయన బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ సామాజిక న్యాయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని విమర్శించారు. బిజెపి కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, మరోసారి దానికి అధికారం ఇస్తే ప్రజాస్వామిక సూత్రాలను కాలరాస్తుందని హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడిందని కమల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బిజెపి కుతంత్రాల నుండి దేశాన్ని రక్షించేందుకు లౌకిక, భావసారూప్యత కలిగిన శక్తులతో చేతులు కలిపానని ఆయన చెప్పారు. రాజకీయాల్లో తన తొలి శత్రువు కులమేనని అంటూ తన జీవితంలోనూ, సినీ జీవితంలోనూ కులానికి చోటులేదని స్పష్టం చేశారు. గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వారిపై నీటి ఫిరంగులు ప్రయోగించిందని, అత్యంత దురుసుగా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని గుర్తు చేశారు. తమిళ మత్స్యకారులకు రక్షణ కల్పించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని కమల్‌ విమర్శించారు. రైతులు, యువకులు, మహిళలు సహా అన్ని వర్గాలనూ విస్మరించిందని అన్నారు. మైనారిటీలను పరాయివారిగా చూస్తోందని, దీంతో వారు భయంతో కాలం గడుపుతున్నారని చెప్పారు.

➡️