ప్రజా సమస్యలు పట్టని నేతలను తిరస్కరించండి

Apr 20,2024 23:11
  • సిపిఎం గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-గన్నవరం

ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారానే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు అన్నారు. గన్నవరం మండలం బుద్ధవరం పంచాయతీ పరిధిలోని దావాజీగూడెం గ్రామంలో శనివారం ఆయన వామపక్ష నాయకులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. మహిళలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసిపి, టిడిపి, జనసేన బిజెపికి తొత్తులుగా మారాయని, స్వార్థ ప్రయోజనాల కోసం బిజెపి బలపడటానికి ఆయా పార్టీల అధినేతలు తోడ్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి పార్టీలను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇండియా వేదిక తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా పోరాటం చేస్తుందని, దానికి అందరూ అండగా నిలవాలని కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ కార్పొరేట్లకు దాసోహం అంటున్నారని విమర్శించారు. మోదీ పాలనలో దేశం దివాళా తీసిందన్నారు. 375 పార్లమెంటు సీట్లు బిజెపికి ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తారని తెలిపారు. రాజ్యాంగాన్ని మారిస్తే దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. దావాజీగూడెం రమణమ్మ చెరువులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేసి న్యాయం జరిగేలా చేసింది ఎర్రజెండా అని గుర్తు చేశారు. ఇంకా ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేసి జైలుకు వెళ్లామని తెలిపారు. రమణమ్మ చెరువులో సౌకర్యాల కల్పనకు బుద్ధవరం పంచాయతీ నుంచి సర్పంచ్‌ బడుగు బాలమ్మ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ నెల 23వ తేదీన నామినేషన్‌ కార్యక్రమానికి వామపక్ష, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, ప్రజలు తరలిరావాలని కోరారు. బుద్ధవరం సర్పంచ్‌ బడుగు బాలమ్మ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తోందని, ఈ పాలనకు రానున్న ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడాలన్నారు. అనంతరం కళ్లం వెంకటేశ్వరరావు ఎన్నికల ఖర్చుకు బాలమ్మ ఒక నెల జీతం రూ.3 వేలు వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు మీరాఖాన్‌, మరియమ్మ, చినబాజీ, కొండా వీరాస్వామి, ఆరేపల్లి మోహనరావు, బడుగు మరియదాసు, ఆంజనేయులు, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

➡️