మిజోరం అభ్యర్థనకు కేంద్రం ‘నో’

Nov 22,2023 11:34 #Conflicts, #Manipur, #Riots, #Violence

న్యూఢిల్లీ : మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో అక్కడి నుండి వచ్చి తమ రాష్ట్రంలో ఆశ్రయం పొందుతున్న శరణార్థులకు నగదు రూపంలో కానీ, ఇతరత్రా కానీ సాయం అందించాలంటూ మిజోరం అనేక నెలలుగా కేంద్రాన్ని కోరుతూనే ఉంది. అయితే దీనిపై మోడీ ప్రభుత్వం స్పందించడం లేదు. మణిపూర్‌ నుండి వచ్చిన 12 వేల మంది శరణార్థులు ప్రస్తుతం మిజోరంలో తలదాచుకుంటున్నారు. వీరి కోసం పది కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలంటూ మిజోరం ముఖ్యమంత్రి జోరాంతంగా తొలుత మేలోనూ, తిరిగి జూన్‌లోనూ కేంద్రానికి లేఖలు రాశారు. అంతేకాక కేంద్ర హోం శాఖతో చర్చించేందుకు ఓ క్యాబినెట్‌ మంత్రిని, ఓ సీనియర్‌ అధికారిని ఢిల్లీకి పంపింది. అయినప్పటికీ కేంద్రం నుండి స్పందన లేదు. వేలాదిగా తరలివచ్చిన శరణార్థుల బాగోగులు చూడడం తమకు తలకుమించిన భారంగా ఉన్నదని జోరాంతంగా ఆ లేఖల్లో కేంద్రానికి తెలియజేశారు. పైగా ఘర్షణలు చోటుచేసుకున్న మయన్మార్‌, బంగ్లాదేశ్‌ నుండి కూడా చాలా మంది మిజోరం వచ్చి ఆశ్రయం పొందుతున్నారు.
కాగా శరణార్థులను ఆదుకునేందుకు ఆర్థిక సాయం చేయలేమని కేంద్ర హోం శాఖ సెప్టెంబరులోనే రాష్ట్రానికి తెలియజేసింది. అయితే ఇతరత్రా సాయం చేస్తానని హామీ ఇచ్చింది. కానీ నేటి వరకూ అది జరగలేదు.

➡️