స్విమ్స్‌లో 479 నర్సు పోస్టుల భర్తీ

  •  టిటిడి పాలకమండలి నిర్ణయాలు వెల్లడించిన చైర్మన్‌

ప్రజాశక్తి – తిరుమల : తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో 479 నర్సు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు ఆయన వెల్లడించారు. టిటిడిలోని అన్ని కళాశాలల్లో సిఫార్సు లేకుండా విద్యార్థులకు హాస్టల్‌ వసతి కోసం అదనంగా భవనాల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. 2014కు ముందు టిటిడిలో నియమించిన కాంట్రాక్టు, పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిపారు. యాత్రా సముదాయంలో లిఫ్ట్‌ల ఏర్పాటుకు రూ.1.88 కోట్లు కేటాయించామని, బాలాజీనగర్‌ సమీపంలో ఫెన్సింగ్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రూ. 14 కోట్లతో టిటిడిలోని 188 క్వార్టర్స్‌ ఆధునీకరణ, గోవిందరాజస్వామి ఆలయంలో బాష్యకార్ల సన్నిధిలో మకర తోరణం బంగారు తాపడం, ఐటి సేవల కోసం రూ.12 కోట్లు, శ్రీవాని ట్రస్టు నిధులతో టిటిడిలోని పురాతన ఆలయాల మరమ్మతుకు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్‌ కుటుంబానికి రూ.ఐదు లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్మానించామని తెలిపారు.
మాజీ బోర్డు సభ్యులు పదేపదే రావొద్దు
టిటిడి ధర్మకర్తల మండలి మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే వారి కుటుంబ సభ్యులతో (భార్యాపిల్లలు, తల్లి, తండ్రి) శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశాన్ని బోర్డు కల్పించిందని టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, కుటుంబ సభ్యులతో కాకుండా ఇతరులను వెంట బెట్టుకుని పదేపదే తిరుమలకు రావడం మంచి పద్ధతి కాదన్నారు. మాజీ బోర్డు సభ్యుని హోదాలో కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలే తప్ప, ఇతరులను వెంట బెట్టుకుని వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్రీవారి దర్శనానికి అనుమతించేది లేదన్నారు.

➡️