చంద్రబాబుతో చర్చకు సిద్ధం : సజ్జల

  • సిపిఎస్‌, మద్యపాన నిషేధం తప్ప అన్నీ చేశాం
  • 14 ఏళ్ల అధికారంతో ప్రజలకు ఏమి చేశారో చంద్రబాబు చెప్పాలి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని చూపి ఓటు అడిగే జగన్‌కు 14 ఏళ్లపాటు అధికారంలో వుండి ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబుకు మధ్య తేడా చాలా వుందని, చర్చకు రావాలనే చంద్రబాబు డిమాండ్‌కు తాము సిద్ధమని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని అడుగుతున్నామని తెలిపారు. జగన్‌ను తిట్టడం తప్ప చంద్రబాబుకు, లోకేష్‌కు వేరే అజెండా లేదని విమర్శించారు. సిపిఎస్‌, మద్యంపై ఇచ్చిన హామీలను తప్ప అన్నీ అమలు చేశామని తెలిపారు. వైసిపి నిర్వహించే సిద్ధం సభలకు జనస్పందన చూస్తే ప్రజల్లో సిఎంపై వున్న ప్రజాధరణ అర్థమవుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం రూ.2.55 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు వాస్తవం కాదా? అని నిలదీశారు. చంద్రబాబుది చెత్త పాలన అని పవన్‌కల్యాణ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి వుంటే వలంటీర్ల వ్యవస్థ మంచిది కాదు, మళ్లీ జన్మభూమి కమిటీలు తెస్తానని చెప్పగలరా? అని ప్రశ్నించారు. సిఎం ఆస్తులు ప్రజలకు పంచాలన్న లోకేష్‌ ప్రకటన హాస్యాస్పదమన్నారు.

➡️