‘సుప్రీం’ తీర్పును చదవండి : కేరళ గవర్నర్‌కు సిజెఐ ధర్మాసనం సూచన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిల్లులను ఆమోదించకుండా తొక్కిపడుతూ చట్టసభలను దాటవేసే అధికారం గవర్నర్‌కు లేదని పంజాబ్‌ గవర్నర్‌కు సంబంధించిన కేసులో గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఒకసారి చదువుకుంటే మంచిదని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ను అత్యున్నత న్యాయస్థానం సూచిం చింది. బిల్లులను ఆమోదించడంలో రాష్ట్ర గవర్నర్‌ ఉద్దేశపూర్వక జాప్యానికి వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారించింది. కేరళ రాష్ట్రం తరపున సీనియర్‌ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ.. గవర్నర్‌ ఆమోదం కోసం పంపిన అనేక బిల్లులు గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కేరళలో కూడా పంజాబ్‌ పరిస్థితి నెలకొందన్నారు. బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని మంత్రులందరూ గవర్నర్‌ను కలిశారని, ముఖ్యమంత్రి చాలాసార్లు కలిశారని అన్నారు. అయినప్పటికీ ఫలితం లేదని పేర్కొన్నారు. ఎనిమిది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వేణుగోపాల్‌ అన్నారు. కోర్టు జోక్యం చేసుకుని గవర్నర్‌కు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కెకె వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. దీంతో జోక్యం చేసుకున్న సిజెఐ చంద్రచూడ్‌ పంజాబ్‌ గవర్నర్‌ కేసులో ఇచ్చిన తీర్పును చదవమని గవర్నర్‌కు తెలపాలని అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణికి సూచించారు. ‘మేము గురువారం రాత్రి పంజాబ్‌ గవర్నర్‌ కేసులో ఆర్డర్‌ను అప్‌లోడ్‌ చేశాం. ఆర్డర్‌ని చూడాలని గవర్నర్‌ సెక్రటరీకి చెప్పండి. మీ ప్రతిస్పందన ఏమిటో మంగళవారం మాకు తెలపండి’ అని సూచించారు. అయితే అటార్నీ జనరల్‌ వెంకటరమణి మాట్లాడుతూ.. మంగళ వారం తాను హాజరుకావడం కష్టమని, కేసును శుక్రవారానికి వాయిదా వేయాలని అభ్యర్థించారు. అయితే దీన్ని కెకె వేణుగోపాల్‌ వ్యతిరేకించారు. కేసు తీవ్రత దృష్ట్యా వీలైనంత త్వరగా ఈ పిటిషన్‌ను విచారించాలని కోరారు. దీంతో ప్రధాన న్యాయ మూర్తి డివై చంద్రచూడ్‌ స్పందిస్తూ.. పిటిషన్‌ను బుధవారం పరిశీలిస్తామని చెప్పారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సివి ఆనంద బోస్‌, పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఉంచారని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తీవ్రంగా విమర్శించింది.

➡️