పంజాబ్‌లోనూ ఇంటి వద్దకే రేషన్‌

Feb 11,2024 11:11 #home, #Punjab, #Ration
  • లాంఛనంగా ప్రారంభించిన కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌

ఖన్నా (పంజాబ్‌) : ఇంటి వద్దకే రేషన్‌ సరుకులను సరఫరా చేసే కార్యాక్రమానికి తాజాగా పంజాబ్‌ శ్రీకారం చుట్టింది. ‘ఘర్‌ ఘర్‌ ముఫ్త్‌ రేషన్‌’ పేరిట చేపట్టిన ఈ కార్యాక్రమాన్ని ఆమాద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌..పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌తో కలిసి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖన్నాలో నిర్వహించిన బహిరంగ సభలో భగవంత్‌ సింగ్‌ మాన్‌ మాట్లాడుతూ ‘ఇంటి వద్దకే రేషన్‌’ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది పైగా వినియోగదారులకు లబ్ది చేకూరనుందని తెలిపారు. కొత్త పథకం ద్వారా నాణ్యమైన గోదుమ పిండి, బియ్యం ఇంటి వద్దకే సరఫరా అవుతాయని తెలిపారు. ఆప్‌ ప్రభుత్వ పాలనలో ప్రజలకు నాణ్యమైన వైద్య, విద్యా సేవలందిస్తున్నామని, యువతకు ఉపాధి అవకాశాలు పొందుతున్నారని, ప్రజలకు ఉచిత విద్యుత్‌ కూడా అందుతోందని పంజాబ్‌ ధేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతోందని గొప్పలు చెప్పారు. దీనంతటికీ కారణం తమ అధినేత కేజ్రీవాల్‌ అందిస్తున్న మార్గదర్శనమేనన్నారు. జివికె పవర్‌ ప్రయివేటు కంపెనీ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ గోయింద్వాల్‌ పవర్‌ ప్లాంట్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఆప్‌ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలను తమకు నచ్చినవారికి కారుచౌకగా అమ్మేశాయని ఆయన విమర్శించారు.

పంజాబ్‌లో అన్ని స్థానాల్లోనూ ఆప్‌ అభ్యర్థుల పోటీ

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాల్లోనూ, అలాగే ఛండీగఢ్‌లో ఒక స్థానంలోనూ పోటీ చేస్తుందని కేజ్రీవాల్‌ తెలిపారు. రెండేళ్ల కిందట ప్రజల ఆశీస్సులతో పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, 117 అసెంబ్లీ స్థానాల్లో 92 చోట్ల విజయాన్ని కట్టబెట్టారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆప్‌ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

➡️