వెలుగులోకి ర్యాంకీ అబద్ధాలు

Apr 7,2024 11:03
  • ఎపిఐఐసి 50 ఎకరాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు ప్రచారం
  • ల్యాండ్‌ఫిల్‌ ప్రజాభిప్రాయ సేకరణలో తప్పుడు సమాచారం!

ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి : అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడిలో ల్యాండ్‌ఫిల్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఎపిఐఐసి) 50 ఎకరాలు రాంకీకి అప్పగించకుండానే ఎపి కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించడం వివాదస్పదమవుతోంది. 50 ఎకరాలు కేటాయించినట్లు ర్యాంకీ చెప్పిన మాటలు అబద్ధాలని అధికారి వివరణతో స్పష్టమైంది. ఈ ఏడాది జనవరి 31న నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ నుంచి భూమి కేటాయింపు వరకూ ఏ రోజూ ప్రజలకు ర్యాంకీ యాజమాన్యం నిజాలు చెప్పలేదు. ప్రజాభిప్రాయ సేకరణకు ముందు పాటించాల్సిన కనీస నియమ, నిబంధనలేవీ పాటించలేదు. కనీసం దండోరా వేయించలేదు. ప్రజాభిప్రాయ సేకరణ విషయం గ్రామస్తులకు తెలీకుండా జాగ్రత్తలు తీసుకున్న ర్యాంకీ యాజమాన్యం పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక (ఇఐఎ)లోనూ ఎపిఐఐసి 2022 జూన్‌ 17న 50 ఎకరాల భూమి లీజు ప్రాతిపదికన కేటాయించినట్లు తప్పుడు సమాచారం ఇచ్చింది. తాడి సర్వే నెంబర్‌ 116 పార్ట్‌లోని 50 ఎకరాల్లో ర్యాంకీకి ల్యాండ్‌ఫిల్‌ ఏర్పాటుకు ఎపిఐఐసి పదెకరాలు కేటాయిస్తే 50 ఎకరాలు కేటాయించినట్లు తెలిపింది.

పదెకరాలే కేటాయింపు !
పరవాడ ఫార్మా సిటీ, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలను శుద్ధి చేసి, నిల్వ చేయడానికి రూ.200 కోట్ల వ్యయంతో ల్యాండ్‌ఫిల్‌ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న ర్యాంకీకి 33 ఏళ్ల లీజుకు ఎపిఐఐసి పదెకరాలు మాత్రమే కేటాయించింది. మరో 40 ఎకరాలను రిజర్వులో పెట్టింది. పదెకరాలకు ర్యాంకీ డబ్బులు చెల్లించింది. స్క్వేర్‌ మీటరుకు రూ.1,200 చొప్పున (ఎకరాకు 4,047 స్క్వేర్‌ మీటర్లు) పదెకరాలకు నాలుగు కోట్లా 85 లక్షలా 64 వేల రూపాయలను రెండు దఫాలుగా ఎపిఐఐసికి చెల్లించింది. 2022 మే 9న ఇఎండి కింద కొంత కట్టగా మిగిలిన మొత్తం అదే ఏడాది సెప్టెంబరు 22న చెల్లించింది. ఈ మొత్తానికి ఎపిఐఐసి పదెకరాలు అప్పగించింది. ర్యాంకీ మాత్రం లీజు ప్రాతిపదికన 50 ఎకరాలు కేటాయించినట్లు పేర్కొని ఇఐఎ నివేదికలో తప్పుడు సమాచారమిచ్చి ప్రజలను మోసగించింది. గ్రీన్‌బెల్ట్‌కు ఉపయోగించాల్సిన స్థలాలను అమ్ముకొని సొమ్ము చేసుకుందన్న ఆరోపణలు కూడా ర్యాంకీపై ఉన్నాయి.

-కె.లోకనాథం, సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి
           -కె.లోకనాథం, సిపిఎం                        అనకాపల్లి జిల్లా కార్యదర్శి

చర్య తీసుకోవాలి
చట్టాలు, నియమనిబంధనలు అమలు చేయని ర్యాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. సదరు సంస్థ ల్యాండ్‌ఫిల్‌ ఏర్పాటులో కూడా ప్రజలకు నిజం చెప్పలేదు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని మోసగించింది. ప్రభుత్వాలను మేనేజ్‌ చేసుకొని నిబంధనల ఉల్లంఘనకు పాల్పడడం ర్యాంకీకి అలవాటుగా మారింది. గతంలో గ్రీన్‌బెల్డ్‌ స్థలాలను అమ్ముకుంది. ర్యాంకీ ఫార్మాసిటీ వల్ల తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని ఆ గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వెంటనే తరలించాలి.

➡️