తాడేపల్లికి ఎమ్మెల్యేల క్యూ : తమకు ఇవ్వకుంటే సతీమణులకు ఇవ్వాలని వేడుకోలు

Dec 20,2023 11:31 #MLA, #Queue, #Tadepalli
  • కొనసాగుతున్న కసరత్తు
  • నెలాఖరుకు కొలిక్కిరానున్న అభ్యర్థుల ఎంపిక

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2024 ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను రూపొందించేందుకు సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను నెలాఖరుకు ఖరారు చేసేందుకు వైసిపి కసరత్తు చేపట్టింది. పార్టీ చేయించుకున్న సర్వేలను రీజనల్‌ కో-ఆర్డినేటర్లకు అందజేసి టికెట్‌ అంశంపై సిట్టింగ్‌లకు తేల్చిచెబుతున్నారు. ఇప్పటికే మొదటి విడతలో ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 11 మంది ఇన్‌ఛార్జులను మారుస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల పార్టీకి క్షేత్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో మలిజాబితా విడుదలపై ఆచితూచి అడుగులు వేస్తోంది. సోమవారం ఉభయగోదావరి జిల్లాల నేతలతో చర్చించిన ముఖ్యమంత్రి మంగళవారం కొంతమంది నేతలు, ఆశావహులతోనూ చర్చలు జరిపారు. గోదావరి జిల్లాలకు సంబంధించి సిట్టింగులకు టికెట్‌లపై తేల్చిచెప్పినా జాబితాను ప్రకటించకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసేందుకు తాడేపల్లికి క్యూ కట్టారు. తమ మీద వ్యతిరేకత వుంటే తమ సతీమణులకైనా టికెట్లు ఇవ్వాలని తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారు. మంగళవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కుటుంబంతో కలిసి సిఎంను కలిశారు. రాష్ట్రంలో 82 మంది ఎమ్మెల్యేలను మార్చాలని వైసిపి తీసుకున్న నిర్ణయం సిట్టింగ్‌లలో తీవ్రమైన ఆందోళనను రేకిత్తిస్తోంది. సిఎంను ఒప్పించుకునేందుకు సిట్టింగ్‌లు విశ్వప్రయత్నాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సిఎంను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారిలో మంత్రులు పినిపే విశ్వరూప్‌, గుమ్మనూరు జయరామ్‌ కూడా వున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై వీరితో సిఎం జగన్‌ చర్చించి అనంతరం ప్రత్యామ్నాయం చూపుతామని హామీ ఇస్తున్నట్లు తెలిసింది. సిట్టింగులతో మాట్లాడాక పోటీచేసే స్థానాల విషయమై స్పష్టత ఇస్తున్నట్లు తెలిసింది. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ప్రసాదరాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషశ్రీ చరణ్‌, కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్‌ బాషా, మాజీ మంత్రి శంకరనారాయణ తాడేపల్లికి వచ్చి సిఎంఒలో పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్లు తెలిసింది. సీటు ఇవ్వడం కుదరదని, అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయం చూస్తామని చెప్పినట్లు తెలిసింది. గోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఖరారైనా వ్యతిరేకత రాకుండా అందరితో చర్చించాక ఇన్‌ఛార్జులను ఖరారు చేసి జాబితాను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది.

➡️