ప్రశ్నించే పెళ్లాం

Apr 21,2024 11:45 #short story, #Sneha

కొత్తగా పెళ్ళైంది వాళ్ళ ఇద్దరికి. పుట్టింటికి, అత్తింటికి వెళ్ళడాలు, సాంప్రదాయాలు, అగడం బగడం అన్నీ అయ్యాక వాళ్ళ ఇద్దరూ అతడి ఇంటికి చేరుకున్నారు. అతనికి ఉద్యోగం వుంది. రోజు టంచనుగా లేచి వెళ్ళిపోయేవాడు. ఆమె చదువుకోలేదు. కానీ కొత్తవిషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస వుంది.
‘సరే నీకు ఉద్యోగం లేదు కదూ… కాబట్టీ ఇంటి పనులు నువ్వు చూసుకో.. ఇక వంటమనిషి దండగ కదా!’ అన్నాడతడు.
ఆమె, ‘నాకు ఇంటిపని, వంట పని ఏదీ సరిగ్గా రాదు’ అంది.
‘అదేమిటి చదువుకోలేదు సరే పనులైనా వచ్చి వుండాలిగా’ అతడి గొంతులో ఆశ్చర్యం.
‘మా అమ్మ నాన్న నన్ను చెయ్యనివ్వలేదు. వాళ్ళే చేసుకునేవారు. నేను పనికివెళ్ళే దాన్నిగా!’ ఏం పని అని అతను అడగలేదు. ఏం పనో ఆమె చెప్పనూలేదు.
‘సరేలే ఏదో ఒకటి అన్నీ చేస్తూ వుంటే అవే వచ్చేస్తాయి దానిదేముంది’ అని అతడు మరోమాట లేకుండా ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో రెండు మూడు రోజుల వరకూ పొయ్యి వెలిగించలేదు. ఎక్కడి పనులు అక్కడే వుండేవి. ఇల్లు తళతళలాడేదికాదు. గిన్నెలు అతడు అనుకునేవిధంగా శుభ్రం అయ్యేవి కాదు. అతడికి వాళ్ళమ్మ ఎంత ఆర్గనైజ్డ్‌గా అన్ని పనులు చేసుకునేదో గుర్తొచ్చి, ఆమెతో తన భార్యని పోల్చుకొని కాస్త మనస్తాపానికి గురయ్యాడు. తన భార్యని ఎలా అయినా దారిలో పెట్టాలని కంకణం కట్టుకొని ఒక రోజు ఆఫీసుకి సెలవు పెట్టి మరీ తన సతీమణికి ఏ పని ఎలా చెయ్యాలో అంతా వివరంగా చెప్పాడు. చేసి మరీ చూపించాడు. అబ్బా తన భర్తకి ఎన్ని పనులు తెలుసు అనుకుంది భార్య.
ఆ రోజు పూర్తవుతూ వుండగా…భర్త ‘ఇదిగో చూడు…నేను ఈ రోజు ఏమి నేర్పించానో అవన్నీ నీకు నువ్వుగా రేపటి నుంచి చెయ్యాలి సరేనా’ అన్నాడు.
‘నాకన్నా మీరే బాగా చేస్తున్నారండి. ఎందుకని మీరే చెయ్యకూడదు. నేను మీకు సాయం చేస్తాను’ అని చాలా నిజాయితీగా అంది భార్య.
భర్త తల పైన పిడుగు పడ్డట్టు అదిరిపడి…’హా..హా…అలా ఎలా అవుతుంది. అది ఆడవాళ్ళ పని దానితో మగవాళ్ళకేం సంబంధం…!?’ అన్నాడు.
‘మరి మీకు ఇవన్నీ ఎలా తెలుసు?’ అడిగింది భార్య.
భర్తకి సమాధానం చెప్పాలనిపించలేదు.
‘అయినా ఆడదానివి నీకు రావల్సిన పనులన్నీ మగవాడ్ని నాకే తెలిసాయి కానీ నీకు తెలియలేదు. దానికి బాధపడడం మానేసి నాకెలా తెలుసని అడుగుతున్నావ్‌’ అన్నాడు.
‘ఇది ఆడవాళ్ళ పని అని ఎవరు చెప్పారు? పనంటే అది అందరిదీ కదండి ఇలా ఆడ మగా తేడాలు ఎందుకు?’ ఆమె ముఖంలో సంశయం తొణికిసలాడింది.
‘ఏడ్చినట్టుందినీ ప్రశ్న’ బుస్సుమన్నాడు అతను.
‘పోని చెప్పండి దీన్ని ఎవరు ఇలా వుండాలని నిర్ణయిస్తారు.’
‘ఎవరూ నిర్ణయించలేదు. మనకి మనమే ఇవన్నీ పెట్టుకున్నాం.’
‘మరి మనమేపెట్టుకున్నవి అయితే మనమే మార్చేయెచ్చు కదండి.’
‘అలా ఎవరు పడితేవాళ్ళు మార్చడానికి ఇదేమైనా ఇంటిముందు వేసే ముగ్గు అనుకున్నావా? పద్ధతి. చీర కట్టి, విప్పినంత తేలిగ్గా మార్చేద్దాం అంటున్నావ్‌!’
‘ పద్ధతులు మారిస్తే ఏం అవుతుందిఅండి?’
‘మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ఏది సరైన రీతిలో వుండదు ఎక్కడ వుండాల్సిన వాళ్ళు అక్కడ వుండక ఇదిగో నీలా పైత్యం పట్టినట్టు మాట్లాడతారు. అది ఈ సమాజానికి మంచిది కాదు.’
‘అవునా! మరి ఈ రోజు అన్ని పనులు మీరే చేసారు. ప్రపంచం ఏం తిరగబడిపోలేదు.’ఆమె మాటల్లో ఒక వింతైన ఆశ్చర్యం.
ఆమె అన్నీ తెలిసే ఇలా మాట్లాడుతుందా అని అతడికి అనుమానం కలిగింది. ఆమె ముఖంలో తేరిపారా చూసాడు. ఒక వింతైన ఉత్సాహం. అదోలాంటి అమాయకత్వం తప్పా అతడికేం కనబడలేదు. ఏం చెయ్యాలో తెలియక తల పట్టుకున్నాడు.
చదువు, సంధ్య లేని పిల్లైతే చెప్పినట్టు విని, గొడ్డులా పని చేస్తుందని తనకి ఈ పెళ్ళి వద్దు మొర్రో అని బతిమిలాడినా బలవంతాన ఒప్పించి పెళ్ళి చేసిన అతని మేనమామ పైన పీకల్లోతు కోపం వచ్చింది అతనికి. తల ఎత్తి ఆమెను చూసాడు.అల్చిప్పల్లాంటి కళ్ళని టపీటపీమని ఆడిస్తూ ….అతడేమైనా చెప్తాడేమో అని అతని వైపే చూస్తుంది.
‘కర్మ! ఏంటి అలా చూస్తున్నావు.’
‘మీకు చాలా విషయాలు తెలిసినట్టు వున్నాయి చెప్తారేమో అని చూస్తున్నాను’ అంది.
అతడు పరిశీలనగా ఆమె ముఖంలోకి చూసాడు.. ఎక్కడైనా వెటకారపు నవ్వు కనబడుతుందేమో అని. అబ్బే లేదు. చాలా తేటగా కనబడుతున్నాయి ఆమెలోని ముఖ కవళికలు. ‘ఏడ్చినట్టుంది. ఒక పూటలోనో ఒక్క రోజులోనో ఏదీ తలకిందులు కాదు..అది ప్రతిరోజూ జరగాలి అప్పుడే అవుతుంది.’
‘అయితే ఇది కూడా గతంలో ఎప్పుడోఅలా అయిపోయి వుంటుందండి.’
‘ఏది?’
‘ఆడవాళ్ళకి ఈ పని భారం రావడం.’
అతడు ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాడు. ‘నువ్వు ఏం చదువుకున్నావ్‌?’
‘ఇప్పుడు అదెందుకండి?’
‘చెప్పు ముందు’
‘నన్ను మళ్ళీ చదివిస్తారా?’ ఆశగా అడిగిందామె.
‘ఆ ఆశలు పెట్టుకోకు కానీ..అడిగింది చెప్పు.. విసుగ్గా అన్నాడు’.
‘టెన్త్‌ క్లాస్‌!’
ఆ మాత్రం చదువుకే ఇన్ని తెలివితేటలా..అనుమానంగా అనుకున్నాడు అతడు.
‘చూడు అవసరానికి మించి ఆలోచిస్తే నీకు మంచిది కాదు. ప్రశ్నలు వెయ్యడం ఆపి. పనులు జరిగేలా చూడు అర్థమైందా?’ ఆ మాట అనేసి, మంచానికి బల్లిలా అతుక్కొని దుప్పటి నిండా కప్పేసుకున్నాడతడు.
‘ప్రశ్నిస్తేనే మార్పు వస్తుందని అంటారు కదండి’…శవంలా పడుకున్న భర్తని వుద్దేశించి ఆమె అంది. ‘ఎవడా అన్నది. ప్రశ్ని స్తే పోయేది మనశ్శాంతి. వచ్చేది అసహనం. అది మనబోటి వారికి మంచిది కాదు’.
‘మంచిది కాకపోవడం అంటే..?’
‘చెడు జరగడం’…
ఆమె ఇంకా ఏదో అనడానికి నోరు తెరిచేసరికి అతడు సర్రున దుప్పటిలాగి
‘ఆపేయి! ఆపశ్న్రని మధ్యలోనే ఆపేరు. అసలు ముందు నుంచీ అనుమానంగానే వుంది. నువ్వు ఏం చదువుకున్నావ్‌…? ఏవిటీ ప్రశ్నల దండయాత్ర. మీ నాన్న నాకు మోసం చేసి నిన్ను అంటగట్టాడా? నీకివన్నీ ఎలా తెలుసు? ప్రశ్నించాలని ఎలా తెలుసు ఎవరు నేర్పించారు. నీకు ఇవన్నీ…?’
‘నాకెవ్వరూ నేర్పించలేదండి.’
‘మరి…?’
‘నేనేనేర్చుకున్నాను’ ఆమె గర్వంగా తల ఎగరేస్తూ అంది.
అతడు ఉలిక్కి పడ్డాడు. ‘నాకు తెలుసే మీది మోసగాళ్ళ కుటుంబం అని. అమాయకులైన మాలాంటి మగవాళ్ళని మోసం చెయ్యడమే మీ పని. ఎందుకు ఇదంతా చేసావ్‌?’
‘నేనేం చేసాను?’ ఆమెకి ఏం అర్ధం కాలేదు.
‘ఇంకేం చెయ్యాలి? నీ చదువుని, అర్హతని దాచావు చాలదూ! ఈ చదువుకున్న ఆడవాళ్ళ గురించి నాకు తెలియదా? నేర్చుకున్నది గోరంత..ప్రశ్నించేది కొండంత. ఏం చదువుకున్నావ్‌ చెప్పు నువ్వు?’
‘టెన్త్‌ క్లాస్‌…..’
‘మళ్ళీ ఆ మాట అన్నావంటే మనిషిని కాదు నేను. నిజం చెప్పు.’
‘నిజంగానే టెన్త్‌ క్లాస్‌ అండి.’
‘ఆహా టెన్త్‌ క్లాస్‌ జ్ఞానంతోనే ఇన్ని తలతిక్క పశ్న్రలు అడుగుతున్నావా?’
‘చదువుకి ప్రశ్నకి సంబంధం ఏంటండి?’
అతడికి తల తిరిగిపోయింది. ఇదెమిటీ పిల్ల.. కాలికేస్తే మెడకి..మెడకేస్తే కాలికి అన్నట్టుంది. అనుకున్నాడు. ఇదంతా అంత తేలిగ్గా తేలే విషయంగా అతనికి అనిపించలేదు. దుప్పటి లోపల శరీరం ఉడుకు పోస్తున్నట్టు ఒకటే మంట. దుప్పటి లాగిపక్కకి గిరాటేసాడు.
‘సరే ప్రశ్నని ఎవరు నేర్పించారు చెప్పు?’ అన్నాడు చిట్టచివరికి.
‘చలం’
‘వాడెవడు ? ఎక్కడుంటాడు? నీ బంధువా? నన్ను ఈ ప్రశ్నలన్నీ అడగమని చెప్పింది ఆ చలమేనా?’
‘అయ్యో అతనితో నేను ఏ రోజు మాట్లాడలేదండి.’
వెర్రిగా చూసాడతడు. ‘ఏం! ఆడుకుంటున్నావా? ఎవడో చెప్పు వాడు.’
ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి! భర్త ఆమెని ఎందుకు నమ్మట్లేదో..ఎందుకు అంత హైరానా పడుతున్నాడో ఆమెకి అర్ధం కాలేదు. ‘నా దగ్గర అతనిది ఒక్క ఫోటోయే వుంది’ అంది ఏడుపు ఆపుకుంటూ.
‘చూపించు’.
ఆమె లోపలికి వెళ్లి సర్దుకొని ఉన్న తన బట్టల బేగులోంచి ఒక పుస్తకం బైటకి తీసింది.
‘ఫోటో బేగులోనేపెట్టుకు తిరుగుతున్నావా….ఆ చలం సంగతేమిటో ఈ రోజే తేల్చేస్తాను నేను’ నడుం పైన చెయ్యి వేసుకోని పోజుగా నిల్చని అన్నాడు ఆ మాట.
ఆమె మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి.. ‘ఇదిగోండి’ అని ఒక పుస్తకాన్ని అతని చేతికి ఇచ్చింది.
అతడు ఆ పుస్తకాన్ని ముందు నుంచి వెనక్కి, వెనుక నుంచి ముందుకి తిప్పి…’ ఇందులో ఏ ఫోటో లేదు…ఏంటి ? ఆడుకుంటున్నావా నాతో!’ గద్దిస్తూ అన్నాడు.
‘ఆ అట్టపైన వున్న అతనే చలం’ అందామె.
‘ఏంటి ఈ ముసలోడా!’….అతడు కాసేపు ఆగి ఏదో అర్ధమైన వాడిలా…’ఈ పుస్తకం చదివి నువ్వు ఇవన్నీ తెలుసుకున్నావా’? అని అడిగాడు.
ఆమె తన కనుగుడ్లు నిండుగా వున్న కన్నీటిని తుడుచేసుకుంటూ…’ఇతనే కాదు రంగనాయకమ్మ, ఓల్గా, శ్రీశ్రీ, ఇంకా చాలామంది.’ అంది ఎక్కడలేని ఉత్సాహాన్ని గొంతులో ఒలకబోస్తూ .
‘నువ్వు ఎక్కడ పని చేసానన్నావ్‌?’
‘నేను ఏం అనలేదండి.’
‘ఇప్పుడు అని చావ్‌.’
‘లైబ్రరీలో..’
అతడు కళ్ళు సీలింగ్‌కి అతుక్కుపోయాయి. లాభం లేదు నా సీను కాలిపోయింది. దీనికన్నా ఉద్యోగం చేసే పెళ్ళామే నయం. దీనితో నేను ఎలా వేగేదిరా దేవుడా! అతడు తల పట్టుకున్నాడు.
‘పాపం తలనొప్పి వచ్చిందేమో జండూ బామ్‌ తెమ్మంటారా అండి?’ ఆమె నిటారుగా నిల్చున్నదల్లా భర్తవైపు కాస్త ఒంగి అడిగింది.

– వి. సృజన
7673905655

➡️