హామీల అమలుపై ప్రశ్నించండి

Dec 13,2023 08:46 #Nara Lokesh, #yuvagalam padayatra

– మద్య నిషేధంపై వైసిపి నేతలను నిలదీయండి

– యువగళం పాదయాత్రలో మహిళలతో లోకేష్‌ ముఖాముఖి

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, నక్కపల్లి విలేకరి ఎన్నికల్లో ఇచ్చిన మూడు హామీలను అమలు చేయని వైసిపి నేతలను మహిళలు నిలదీయాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్డిగల్లు వద్ద భోజన విరామ సమయంలో మహాశక్తి కార్యక్రమం పేరిట పాయకరావుపేట నియోజకవర్గ మహిళలతో లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంపూర్ణ మద్య నిషేధం, ఇంట్లో పిల్లలందరికీ అమ్మఒడి, 45 ఏళ్లు నిండిన మహిళలకు పింఛన్‌ ఎందుకు అమలు చేయలేదో వైసిపి నేతలను మహిళలు ప్రశ్నించాలన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున అందిస్తామని, ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 50 ఏళ్ల మధ్య మహిళలకు నెలకు రూ.1500, దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ కనెక్షన్లు మహిళలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోన్న పన్నులను తగ్గిస్తామని, చంద్రన్న బీమాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వన్‌ టైమ్‌ సెటిల్‌ మెంట్‌ కింద చెల్లించి, తర్వాత ప్రతి ఏటా డబ్బులు నేరుగా కాలేజీలకు జమ చేస్తామని చెప్పారు. జగన్‌ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మహిళల స్వయం ఉపాధి కోసం కుట్టు శిక్షణ ఇప్పించి వారితో స్కూల్‌ యూనిఫాం కుట్టించే విషయం ఆలోచిస్తున్నామని తెలిపారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళా అధ్యక్షులు వంగలపూడి అనిత, వి.మాడుగుల మాజీ ఎమ్మెల్యే డి.రామానాయుడు, జనసేన నాయకుడు గెడ్డం బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

➡️