జలదిగ్బంధంలో క్వీన్స్‌లాండ్‌.. నీటమునిగిన విమానాశ్రయం…!

Dec 18,2023 12:38 #airport, #Cyclone, #floods, #Queensland

ఆస్ట్రేలియా : జాస్పర్‌ తుపాను కారణంగా … ఆస్ట్రేలియాలోని ఉత్తర క్వీన్స్‌లాండ్‌ జలదిగ్బంధమయ్యింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పోర్ట్‌ డగ్లస్‌కు ఉత్తరాన ఉన్న వుజాల్‌వుజాల్‌ నగరం పూర్తిగా నీటిలో చిక్కుకుపోయింది. దీనికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ వరదలకు ఎంత లేదన్నా బిలియన్‌ డాలర్ల వరకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు.

1977 రికార్డును దాటేశాయి…

1977లో నమోదైన భారీ వరదల రికార్డును ఇవి దాటేసి ఉంటాయని క్వీన్స్‌లాండ్‌ ప్రీమియర్‌ జాన్‌ మైల్స్‌ పేర్కొన్నారు. 24 గంటల వ్యవధిలో బ్లాక్‌ మౌంటైన్‌లో 625 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసినట్లు తెలిపింది. ఈ స్థాయిలో వర్షపాతం ఇదే తొలిసారి : అధికారులుతుపాను ప్రారంభమైనప్పటి నుంచి 20 చోట్ల మీటరుకు పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. డెయిన్‌ట్రీ నదీ పరీవాహక ప్రాంతంలో మొత్తం 820మి.మీల వర్షపాతం రికార్డయింది. రానున్న 24 గంటల్లో కొన్ని చోట్ల 500మి.మీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో ఒక ప్రదేశంలో ఈ స్థాయి వర్షపాతం చవిచూడటం ఇదే తొలిసారి అని అధికారులు భావిస్తున్నారు.

ఎయిర్‌పోర్టు మూసివేత…

తీవ్ర తుపాను కారణంగా … నదులు, కాల్వలు కట్టలు తెంచుకుంటున్నాయి. కెయిర్న్స్‌ ఎయిర్‌పోర్టు నీటమునగడంతో మూసివేశారు. ఇక్కడ కొన్ని విమానాలు రెక్కల వరకు నీట మునిగాయి. కెయిర్న్స్‌ నగరంలో ఏకంగా 2 మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో అక్కడ భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరికొందరు వరదలోనే చిక్కుకుపోయారు. వైద్యశాలలు కూడా నీటమునిగాయి. కెయిర్న్స్‌ నగరంలోకి మొసళ్లు కొట్టుకొచ్చాయి. ఇప్పటికే సహాయక బృందాలు రంగంలోకి దిగినట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో దాదాపు 300 మందిని అధికార సిబ్బంది రక్షించారు.

➡️