జీతం కోసం అర్ధనగ్నంగా పంప్ హౌస్ కార్మికుల భిక్షాటన

Jan 13,2024 14:15 #Vizianagaram
pump house workers protest
  •  ఒక్క నెలైనా జీతం చెల్లిస్తే పండగ జరుపుకుంటామని అభ్యర్థన 

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం నగరపాలక సంస్థ నందు పనిచేస్తున్న పంప్ హౌస్ కార్మికులకి జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు, కాంట్రాక్టర్ తీరును నిరసిస్తూ శనివారం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద అర్ధ నగ్నంగా, కాళీ కంచాలతో కనీసం ఒక నెల అయినా జీతం ఇస్తే పండగ జరుపుకుంటామని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి, మున్సిపల్ యూనియన్ నాయకులు ఏ.జగన్మోహన్ రావు మాట్లాడుతూ గత నెల రోజులుగా బకాయి వేతనాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న జీతాలు చెల్లించకుండా పండగ పూట కార్మికుల్ని పస్తులతో ఉంచడం, కొత్త బట్టలు లేకుండా అర్థనగ్నంగా నిలబెట్టడం, జీతం కోసం అడుక్కునే పరిస్థితికి తీసుకురావడం దురదృష్టకరమన్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించామని, అధికారులు దొడ్డి దారిన చిత్తగించారని, చివరికి రాత్రి 7:30 గంటల సమయంలో మున్సిపల్ డీఈ అప్పారావు వచ్చి రెండు నెలలు జీతం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారని, కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో మరల శనివారం ఆందోళన చేయాల్సి వచ్చిందని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దక్షిణామూర్తి స్పందిస్తూ కనీసం ఒక్క నెలైనా జీతం ఈరోజు కాంట్రాక్టర్తో ఇప్పించే ప్రయత్నం చేస్తానని ‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించామని తెలిపారు. కార్యక్రమంలో పంపు హౌస్ యూనియన్ నాయకులు మురళి, అరుణ్ సత్యనారాయణరావు, రామ్మోహన్ నాయుడు, సన్యాసిరావు, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️