అత్యవసర మానవతాసాయం అందించండి

Nov 18,2023 11:52 #israel hamas war
  • ఎట్టకేలకు తీర్మానాన్ని ఆమోదించిన భద్రతామండలి

ఐక్యరాజ్య సమితి : గత నెల రోజులకు పైగా సాగుతున్న ఇజ్రాయిల్‌ యుద్ధంపై తీర్మానాన్ని ఆమోదించడంలో నెలకొన్న ప్రతిష్టంభనను ఎట్టకేలకు భద్రతా మండలి అధిగమించగలిగింది. ఎలాంటి ఆటంకం లేకుండా అత్యవసరమైన మానవతా సాయాన్ని బాధితులకు అందించేందుకు వీలుగా గాజాలో మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేయాలని పిలుపునిస్తూ భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది.
గాజాలోని బాధితులకు ఆహారం, మందులు, ఇతర సామగ్రిని అందజేసేందుకు వీలుగా ఆటంకాలు తొలగించి, మార్గాలను తెరవాలని కోరుతూ ఐరాస భద్రతా మండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పదిహేను మంది సభ్యులుండే భద్రతా మండలిలో 12 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా అమెరికా, బ్రిటన్‌, రష్యా గైర్హాజరయ్యాయి.
హమస్‌ జరిపిన దాడులను ఖండించడంలో తీర్మానం విఫలమైందని ఆరోపిస్తూ అమెరికా, బ్రిటన్‌ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. మానవత్వంతో కాల్పుల విరమణ పాటించాలని తీర్మానం కోరనందుకు నిరసనగా రష్యా ఓటింగ్‌కు గైర్హాజరైంది. తీర్మానంలో సవరణ చేసేందుకు ఓటింగుకు ముందు రష్యా చేసిన ప్రయత్నం ఫలించలేదు. బందీలుగా ఉంచిన వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని తీర్మానం కోరింది. యూరప్‌ దేశమైన మాల్టా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ‘మేము ఈ రోజు సాధించింది ముఖ్యమైన తొలి చర్య’ అని ఐరాసలో మాల్టా రాయబారి ఫ్రాజియర్‌ వ్యాఖ్యానించారు. ఈ యుద్ధంలో అనేక అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘనకు గురవుతున్నాయని, దీనిపై దర్యాప్తు జరిపించాలని ఐరాస మానవ హక్కుల అధిపతి వాల్కర్‌ టర్క్‌ కోరారు.

  • బుల్డోజర్లతో ఆస్పత్రి ఎంట్రన్స్‌ ధ్వంసం

గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి షిఫా దక్షిణ ప్రాంత ప్రవేశ ద్వారాన్ని ఇజ్రాయిల్‌ దళాలు బుల్‌డోజర్లతో ధ్వంసం చేశాయని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. నలభై రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయిల్‌ దళాలు ప్రధానంగా ఈ ఆస్పత్రినే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి. ఈ దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. షిఫా ఆస్పత్రిలో చేపట్టిన గాలింపు చర్యల్ని కొనసాగిస్తామని గాజాలో ఇజ్రాయిల్‌ సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న దళాల అధిపతి మేజర్‌ జనరల్‌ యారన్‌ ఫింకెల్‌మాన్‌ చెప్పారు.

  • హృదయవిదారకమైన దృశ్యాలు

ఇజ్రాయిల్‌ దళాలు బుధవారం ఈ ఆస్పత్రిలో ప్రవేశించడానికి ముందు లోపల 2,300 మంది రోగులు, సిబ్బంది, నిరాశ్రయులైన పౌరులు ఉన్నారని ఐరాస సంస్థలు అంచనా వేశాయి. ముసుగులు ధరించిన కొందరు ఇజ్రాయిల్‌ సైనికులు గాలిలోకి కాల్పులు జరిపారని, లొంగిపోవాల్సిందిగా యువతను ఆదేశించారని లోపల చిక్కుకుపోయిన ఓ పాత్రికేయుడు తెలిపారు. ఇజ్రాయిల్‌ సైనికులు కొందరు పాలస్తీనియన్లను నగంగా నిలబెట్టి ఆయుధాలు, పేలుడు పదార్థాల కోసం తనిఖీలు చేశారని ఆయన చెప్పారు. ఆస్పత్రి లోపల పరిస్థితి హృదయవిదా రకంగా ఉన్నదని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. మత్తుమందు ఇవ్వకుండానే శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఆహారం, నీరు లభించక రోగుల బంధువులు కారిడార్లలో ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా వుండగా హమాస్‌ను పూర్తిగా నాశనం చేసే వరకూ ఇజ్రాయిల్‌ యుద్ధం ఆగదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు.

➡️