అవాస్తవాల ప్రచారం

Dec 19,2023 07:45 #Editorial

ఆ తర్వాత 2017-18కి మళ్ళీ గణాంకాలు సేకరించారు. 2011తో పోల్చినప్పుడు ఆ గణాంకాలు ఎంత దారుణ స్థితిని సూచించాయంటే మోడీ ప్రభుత్వం ఆ గణాంకాలను మొత్తంగానే విడుదల చేయకుండా తొక్కిపెట్టింది. ఎంతో కొంతమేరకు ఆ గణాంకాల్లో బైటకు పొక్కినదానిని బట్టి లభించే వివరాలను చూస్తే 2011-12తో పోల్చితే 2017-18 నాటికి మరో తొమ్మిది శాతం మేరకు ప్రజల వినిమయ శక్తి తరిగిపోయింది. దానిని బట్టి కనీస స్థాయిలో ఆహారధాన్యాలు పొందలేకపోతున్నవారు గ్రామీణ ప్రాంతంలో 80 శాతానికి పెరిగారు.

ఏ విధంగా చూసుకున్నా పూర్తి స్థాయి పేదరికం లోకి దిగజారిపోతున్నవారి నిష్పత్తి పెరుగుతూనే వుంది. ప్రభుత్వ నియంత్రణలో మార్కెట్‌ ఉన్న కాలంలో తగ్గుతూ వచ్చిన పేదరికం నయా ఉదారవాద కాలంలో పెరుగుతూ పోతోంది. నయా ఉదారవాదాన్ని సమర్ధించే బాకారాయుళ్ళు ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చుతున్నారు. అందుకోసం రకరకాల మోసపూరిత వాదనలను, వక్రీకరణలను ముందుకు తెస్తున్నారు. నయా ఉదారవాద కాలం అంటేనే అందరికీ సిరిసంపదలను అందించే కాలం అంటూ చిత్రిస్తున్నారు.

              నయా ఉదారవాదం ఓ పచ్చి అబద్ధాల పుట్టగా తయారైంది. అంతకు మునుపటి పరిస్థితితో-అంటే, ప్రభుత్వ నియంత్రణ కింద మార్కెట్‌ శక్తులు వ్యవహరించవలసి వచ్చిన కాలంతో-పోల్చితే, నయా ఉదారవాద కాలం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నట్టు చిత్రించడానికే ఈ అబద్ధాల ప్రచారం సాగుతోంది. నయా ఉదారవాద కాలంలో జిడిపి వృద్ధిరేటులో ఎంత పెరుగుదల ఉందంటే దాని ఫలితంగా ప్రజానీకం మొత్తంగానే చాలా మెరుగైన పరిస్థితులలో జీవించగలుగుతున్నారు అని నమ్మించడమే ప్రధాన వ్యూహంగా ఈ ప్రచారం ఉంటోంది. అత్యధిక శాతం ప్రజలు పేదరిక స్థాయి నుండి బైటపడిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. ఒక వీర ఔత్సాహికుడైతే ప్రస్తుతం మన దేశంలో కేవలం రెండే రెండు శాతం ప్రజలు మాత్రమే ఇంకా పేదరికంలో కొనసాగుతున్నారని ప్రకటించాడు కూడా !

ప్రభుత్వ నియంత్రణ కింద మార్కెట్‌ శక్తులు వ్యవహరించవలసి వచ్చిన పూర్వ కాలంలో (1990కి మునుపు) మన దేశం ఏమీ సిరి సంపదలతో తులతూగిపోలేదు, నిజానికి అప్పటి విధానాలను విమర్శించడంలో వామపక్షాలే ముందున్నాయి కూడా. కాని, అప్పటికన్నా ఇప్పుడు ప్రజల జీవన ప్రమాణాలు బాగా మెరుగుపడినట్టు నయా ఉదారవాదం చెప్పుకోవడం మాత్రం పూర్తిగా అవాస్తవం.

నయా ఉదారవాదం ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తున్న వైనాన్ని (ప్రస్తుత ఫాసిస్టు తరహా ప్రభుత్వ హయాంలో మాత్రమే కాక అంతకు ముందరి ప్రభుత్వాల హయాంలో సైతం) ఇప్పుడు నేను ప్రస్తావించబోవడం లేదు. వ్యక్తి ప్రయోజనాలే కేంద్రంగా, స్వార్ధమే పరమావధిగా సమాజం యావత్తూ వ్యాపించిన భావజాలం గురించీ ప్రస్తావించను, సంపదలను మరింత ఎక్కువగా పోగేసుకోవాలనే దురాశతో, పేదలంటే తీవ్ర ద్వేషంతో వ్యవహరించే సంపన్నులను సృష్టించిన వైనాన్నీ నేనిక్కడ లేవనెత్తబోవడం లేదు. మనం జీవిస్తున్న కాలంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగనంత ఘోరంగా జాతి నిర్మూలన సాగుతూంటే, దానికి వ్యతిరేకంగా ప్రజానీకం తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయబూనినప్పుడు ఆ నిరసన ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే మీడియాలో ఎక్కడా కనీసమైన విమర్శ కూడా కనిపించనంతగా మన దేశ నైతిక ప్రమాణాలు పతనం అయ్యాయన్న సంగతినీ నేను చర్చించబోవడం లేదు. కేవలం ఆర్థిక సూచికలకు మాత్రం పరిమితం అవుతాను.

కొట్టవచ్చినట్టు కనిపించేదీ, విషాదభరితమూ అయిన ఆర్థిక సూచిక రైతుల ఆత్మహత్యలు. మూడు లక్షల మందికి పైగా రైతులు, వ్యవసాయ కూలీలు గత మూడు దశాబ్దాల కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. స్వతంత్రం పొందిన తర్వాత మన దేశంలో ఇంతవరకూ ఇటువంటిది మనం చూడలేదు. ఈ ఆత్మహత్యలకు ప్రత్యక్ష కారణం రైతుల దుర్భర దారిద్య్రం. ఆ పరిస్థితికి వారిని నెట్టినవి నయా ఉదారవాద విధానాలే. ఆ విధానాల అమలులో భాగంగానే రైతులకు ప్రభుత్వం మద్దతును ఉపసంహరించింది. వాణిజ్య పంటలకు అంతవరకూ ప్రభుత్వం మద్దతు ధర ఇస్తూ వచ్చింది. ఇప్పుడు దానిని రద్దు చేయడంతో ప్రపంచ మార్కెట్‌తో బాటు దేశీయంగానూ వాణిజ్య పంటల ధరలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. పలువురు రైతులు దివాలా తీశారు.

1991కి, 2011కి మధ్య వ్యవసాయదారుల సంఖ్య కోటీ ఏభై లక్షల మేరకు తగ్గిపోయింది. కొందరు రైతులు కూలీలయ్యారు. మరికొందరు పట్టణాలకు వలసలు పోయి అక్కడ ఉపాధి వేటలో పడ్డారు. అంతకు పూర్వపు కాలంతో పోల్చితే నయా ఉదారవాద కాలంలో కొత్త ఉద్యోగాల కల్పన వేగం తగ్గిపోయింది. అంతకు పూర్వపు కాలంలో జిడిపి వృద్ధి రేటు చాలా తక్కువగా ఉండేది. మరోపక్కన వలస పాలన పుణ్యమా అని నిరుద్యోగమూ చాలా అధికంగానే ఉండేది. ఆ కాలంలో కొత్త ఉద్యోగాల కల్పన రేటు రెండు శాతంగా ఉండేది. అదే నయా ఉదారవాద కాలంలో (జిడిపి వృద్ధిరేటు బాగా పెరిగినా) కొత్త ఉద్యోగాల కల్పన రేటు ఒక్క శాతానికి పడిపోయింది. సగానికి సగం తగ్గిపోయింది. దాంతో నిరుద్యోగ సైన్యం విపరీతంగా పెరిగిపోతోంది. కనీసం జనాభా ఏ వేగంతో పెరుగుతోందో ఆ మేరకన్నా ఉపాధి కల్పనలో పెరుగుదల లేదు. సిఎంఐఇ అంచనా ప్రకారం గత ఐదేళ్ళ కాలంలో ఉన్న ఉద్యోగాల సంఖ్యలో ఏ పెరుగుదలా లేదు.

జిడిపి వృద్ధి రేటు పెరుగుతున్నా, ఉపాధి కల్పనలో పెరుగుదల లేకపోవడానికి కారణం ఉంది. కార్మికుల ఉత్పాదకత వృద్ధిరేటు వేగం ఈ కాలంలో బాగా పెరగడమే ఆ కారణం. నయా ఉదారవాద విధానాలతోబాటు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర స్థాయిలో విదేశీ పోటీని ఎదుర్కోవలసి వచ్చింది. ఆ పోటీని తట్టుకునే క్రమంలో కార్మిక వర్గపు ఉత్పాదకత వేగంగా వృద్ధి చెందింది. ఐతే ఆ వృద్ధికి తగ్గట్టు వారి ఆదాయాలు మాత్రం పెరగలేదు. ఒక కనీస స్థాయికి ఆ వేతనాలు కట్టడి చేయబడ్డాయి. దాంతో మిగులులో వారి వాటా తగ్గిపోయింది. ఆ విధంగా నయా ఉదారవాద విధానాల కాలంలో ఆర్థిక అసమానతలు బాగా పెరిగాయి. బడా పెట్టుబడిదారులతోబాటు ఒక చిన్న ఉన్నత మధ్యతరగతి వర్గం కూడా తన ఆదాయాలను బాగా పెంచుకోగలిగింది. వీరంతా ప్రస్తుతం నయా ఉదారవాదానికి గట్టి సమర్ధకులుగా కొనసాగుతున్నారు.

థామస్‌ పికెటీ, లూకాస్‌ చాన్సెల్‌ అనే ఇద్దరు ఫ్రెంచి ఆర్థికవేత్తలు మన దేశంలో ఆదాయాలలోని అసమానతలను అంచనా కట్టారు. ఇందుకోసం వారు మన దేశ ఆదాయ పన్ను గణాంకాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. మొత్తం దేశపు జాతీయాదాయంలో అత్యంత సంపన్నులైన ఒక్క శాతం జనం తాలూకు వాటా ఎంత అన్నది లెక్క గట్టారు. 1982 నాటికి ఆ ఒక్క శాతం సంపన్నుల వాటా 6 శాతానికి తగ్గింది. అంటే ఆదాయాల్లో అసమానతలు తగ్గుతూ వచ్చాయన్న మాట. ఆ తర్వాత, ముఖ్యంగా నయా ఉదారవాద విధానాలు అమలు కావడం మొదలయ్యాక వారి వాటా పెరుగుతూ పోయింది. 2013-14 నాటికి వారి వాటా 22 శాతం అయింది. మన దేశంలో ఆదాయ పన్ను విధించడం మొదలైనది 1922లో. అప్పటి నుండీ చూస్తే ఇంత ఎక్కువ వాటా సంపన్నులకు ఇంతకు మునుపెన్నడూ లేదు. ఇదే మాదిరిగా తక్కిన దేశాల్లోనూ ఆర్థిక అసమానతలు పెరిగాయి. మిగులులో సంపన్నుల వాటా పెరుగుతోంది. అది అధికోత్పత్తి సంక్షోభానికి దారి తీసింది. నయా ఉదారవాద విధానాలు ముందుకు పోడానికి దారి లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్మికుల తలసరి నిజ ఆదాయాలలో పెరుగుదల లేకపోగా, ఉద్యోగులతో పోల్చినప్పుడు నిరుద్యోగుల నిష్పత్తి పెరుగుతూ పోతోంది. పని చేసేవారిలో పూర్తి ఉద్యోగులు, కొద్ది గంటలు లేదా నెలలో కొద్ది రోజులు మాత్రమే పని దొరుకుతున్నవారు, ఉన్న పనులు పోగొట్టుకుంటున్నవారు- ఇలా రకరకాలుగా ఉన్నారు. వీరిలో పూర్తి స్థాయిలో పని లభిస్తున్నవారి సంఖ్య సాపేక్షంగా తగ్గుతోంది గనుక సగటు తలసరి నిజ ఆదాయాలు పడిపోతున్నాయి. వారు తిరిగే రోడ్ల స్థితి మెరుగుపడింది. వీధిలైట్లు బాగా వెలుగుతున్నాయి. కాని వారికి ప్రాథమికంగా అత్యంత అవసరం అయిన ఆహారధాన్యాల లభ్యత మాత్రం తగ్గిపోతోంది. పేదరికం కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది.

1973-74 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని పేదరికాన్ని మన దేశంలో అధ్యయనం చేయడం ప్రారంభమైంది. పూర్తి స్థాయిలో పేదరికం నెలకొంది అని నిర్ధారించడానికి ఆ ప్రజలకు ఎంత శక్తినిచ్చే ఆహార దినుసులు లభిస్తున్నాయి అన్నది కొలబద్దగా ప్లానింగ్‌ కమిషన్‌ తీసుకుంది. గ్రామాల్లో తలసరి 2200 కేలరీలు, పట్టణాల్లో 2100 కేలరీలు ప్రమాణంగా తీసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంక్‌ వంటి సంస్థలు ఈ ప్రమాణాన్ని నీరుగార్చడానికి చాలా కుట్రలు సాగిస్తూ వచ్చాయి. తద్వారా దేశంలో పేదరికం తగ్గిపోయిందంటూ చిత్రించ ప్రయత్నించాయి. కాని ఇప్పుడు మనం మాత్రం ఈ ప్రాథమికమైన నిర్వచనానికే కట్టుబడదాం.

1973-74లో తలసరి 2200 కేలరీల శక్తినిచ్చే ఆహారం పొందలేకపోయినవారు 56.4 శాతం గ్రామీణ జనాభా. తలసరి 2100 కేలరీల శక్తినిచ్చే ఆహారం పొందలేకపోయిన పట్టణ జనాభా 49,2 శాతం. 1993-94 వచ్చేసరికి అది గ్రామాల్లో 58 శాతానికి (స్వల్ప పెరుగుదల) పట్టణాల్లో 57 శాతానికి (ఇది కాస్త ఎక్కువ పెరుగదల)పెరిగింది. అప్పటికి దేశంలో నయా ఉదారవాద విధానాల అమలు మొదలైంది. 2011-12 నాటికి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 68 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 65 శాతానికి పెరిగింది.

ఆ తర్వాత 2017-18కి మళ్ళీ గణాంకాలు సేకరించారు. 2011తో పోల్చినప్పుడు ఆ గణాంకాలు ఎంత దారుణ స్థితిని సూచించాయంటే మోడీ ప్రభుత్వం ఆ గణాంకాలను మొత్తంగానే విడుదల చేయకుండా తొక్కిపెట్టింది. ఎంతో కొంతమేరకు ఆ గణాంకాల్లో బైటకు పొక్కినదానిని బట్టి లభించే వివరాలను చూస్తే 2011-12 తో పోల్చితే 2017-18 నాటికి మరో తొమ్మిది శాతం మేరకు ప్రజల వినిమయ శక్తి తరిగిపోయింది. దానిని బట్టి కనీస స్థాయిలో ఆహారధాన్యాలు పొందలేకపోతున్నవారు గ్రామీణ ప్రాంతంలో 80 శాతానికి పెరిగారు (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ రిసెర్చ్‌కి ఉత్సా పట్నాయక్‌ తాజాగా సమర్పించిన నివేదిక ‘ఎక్స్‌ప్లోరింగ్‌ ది పావర్టీ క్వశ్చన్‌’ నుండి) !

ప్రపంచ ఆకలి సూచికలో ఉన్న 125 దేశాలకు గాను మన దేశం 111వ స్థానంలో ఉండడం ఆశ్చర్యం కలిగించేదేమీ కాదు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌ వంటి పొరుగు దేశాలకన్నా మనం ఆ సూచికలో వెనుకబడ్డాం.

దేశం మొత్తం మీద తలసరి ఆహారధాన్యాల లభ్యతకు సంబంధించిన గణాంకాలతో సరిపోల్చినా పై గణాంకాలు సరైనవేనని స్పష్టపడుతుంది. బ్రిటిష్‌ ఇండియాలో తొలి కాలంలో తలసరి ఆహార ధాన్యాల లభ్యత 200 కిలోలు. అది కాస్తా క్రమంగా తగ్గుతూ స్వతంత్రం వచ్చేనాటికి 138 కిలోలకు దిగజారింది. ఈ దిగజారుడును అరికట్టి మెరుగుదల సాధించడానికి 1980 దశకం దాకా సమయం పట్టింది. అప్పటి నుంచీ తలసరి ఆహార ధాన్యాల లభ్యత దాదాపుగా స్థిరంగా ఒకే స్థాయిలో కొనసాగుతోంది. దేశంలో సంపన్నులు స్వీకరించే ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ వాటా పెరుగుతోంది. మరోపక్క కోళ్ళు, పందులు, తదితర పశువులకు మేత రూపంలో ఖర్చు చేసే ఆహారధాన్యాల వాటా కూడా పెరుగుతోంది. దానిని బట్టి తక్కిన జనాభా వాటా తరుగుతోంది అని చెప్పవచ్చు. అందుచేత ఏ విధంగా చూసుకున్నా పూర్తి స్థాయి పేదరికం లోకి దిగజారిపోతున్నవారి నిష్పత్తి పెరుగుతూనే వుంది. ప్రభుత్వ నియంత్రణలో మార్కెట్‌ ఉన్న కాలంలో తగ్గుతూ వచ్చిన పేదరికం నయా ఉదారవాద కాలంలో పెరుగుతూ పోతోంది.

నయా ఉదారవాదాన్ని సమర్ధించే బాకారాయుళ్ళు ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చుతున్నారు. అందుకోసం రకరకాల మోసపూరిత వాదనలను, వక్రీకరణలను ముందుకు తెస్తున్నారు. నయా ఉదారవాద కాలం అంటేనే అందరికీ సిరిసంపదలను అందించే కాలం అంటూ చిత్రిస్తున్నారు.

(స్వేచ్ఛానుసరణ) ప్రభాత్‌ పట్నాయక్‌
(స్వేచ్ఛానుసరణ) ప్రభాత్‌ పట్నాయక్‌
➡️