ప్రాజెక్టులు ఖాళీ

Jan 12,2024 10:09 #empty, #Projects
  • వేసవిలో కష్టాలు తప్పవా ?

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ ఖాళీ అయ్యాయి. గత ఏడాది వర్షాభావ పరిస్థితులకు తోడు వచ్చిన నీటిని ప్రణాళికాబద్దంగా వినియోగించుకోకపోవడంతో జనవరిలోనే ప్రాజెక్టుల్లోని నీటిమట్టాలన్నీ ప్రమాదకర పరిస్థితుల్లోకి పడిపోయాయి. జనవరిలోనే ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు అడుగంటి పోతే జూలైదాకా తాగునీటి అవసరాల సమస్య పరిష్కారం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు ఇప్పటికే డెడ్‌స్టోరేజ్‌ స్థాయికి చేరువయ్యాయి. ప్రస్తుతం శ్రీశైలంలో కేవలం 47.6 టిఎంసిలు మాత్రమే వున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 84.28 టిఎంసిలు వుండేవి. తుంగభద్ర డ్యామ్‌లో గత ఏడాది 67.75 టిఎంసిలు వుండగా, ప్రస్తుతం కేవలం 10.21 టిఎంసిలు వున్నాయి. నాగార్జునసాగర్‌లో గత ఏడాది 273.27 టిఎంసిలు వుండగా, ఈ ఏడాది కేవలం 154 టిఎంసిలు ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులో గత ఏడాది 44.2 టిఎంసిలు వుంటే ఈ ఏడాది కేవలం 12.45 టిఎంసిలు మాత్రమే వున్నాయి. వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో గత ఏడాది 12.94 టిఎంసిలు వుండగా, ఈ ఏడాది కేవలం 2.62 టిఎంసిలు మాత్రమే వున్నాయి. సోమశిల ప్రాజెక్టులో గత ఏడాది 71.90 టిఎంసిలు వుంటే ఇపుడు 31.2 టిఎంసిలు మాత్రమే వున్నాయి. కండలేరు రిజర్వాయర్‌లో గత 52.5 టిఎంసిలు వుంటే ప్రస్తుతం 12.8 టిఎంసిలు మాత్రమే వున్నాయి. ఇలా రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్‌లలో నీటి నిల్వలు జనవరినాటికే అడుగంటిపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న కృష్ణా, గోదావరి, పెన్నా నదిపై వున్న మొత్తం ప్రాజెక్టుల నీటి సామర్థ్యం 870 టిఎంసిలుకాగా, ఈ ఏడాది కేవలం 289 టిఎంసిలు మాత్రమే వుంది. ఇందులో నాగార్జునసాగర్‌లో డెడ్‌ స్టోరేజ్‌ నీటి నీటి నిల్వ 130 టిఎంసిలు, శ్రీశైలంలోని 35 టిఎంసిలతోపాటు ఇతర ప్రాజెక్టుల్లోని డెడ్‌స్టోరేజ్‌ నీటి మట్టాలను తీసివేస్తే రాష్ట్ర అవసరాల కోసం వినియోగించుకునే నీటినిల్వలు చాలా తక్కువ. ఇపుడున్న కొద్దిపాటి నిల్వలను అయినా జాగ్రత్తగా వాడకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తే పరిస్థితి వుంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

➡️