మెరుగైన పరిశోధనలతోనే లాభసాటి సేద్యం

Dec 31,2023 02:21

ప్రజాశక్తి – బాపట్ల
కర్షక లోకం లాభసాటి సేద్యానికి వ్యవసాయ రంగంలో నిరంతర పరిశోధన ప్రక్రియ ఫలితాలతో ఉద్భవించిన రోబోటిక్ సేవలు అన్నదాతకు ఎంతో అవసరమని జాతీయ వ్యవసాయ ఇంజనీరింగ్ పరిశోధన స్థానం (భోపాల్) డైరెక్టర్ డాక్టర్ సిఆర్ మెహతా అన్నారు. స్థానిక ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో వ్యవసాయంలో రోబోటిక్స్ ఆవిష్కరణ అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సుకు ఆయన శనివారం హాజరయ్యారు. గుంటూరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ ఇంజనీరింగ్ టెక్నాలజీ డీన్ ఎ మణి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల చెంతకు చేర్చాలని అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణలతో హరిత విప్లవ సాధనకు కృషి జరిగితేనే రైతన్నకు వ్యవసాయంలో స్థిరమైన రాబడి లభిస్తుంది అన్నారు. విద్యావంతులైన యువతను వ్యవసాయం పట్ల ఆకర్షితులను చేయాల్సిన బాధ్యత నేటి శాస్త్రవేత్తలపై ఉందన్నారు. ఉద్యోగం, ఉపాధి కంటే వ్యవసాయం రెట్టింపు రాబడి తెచ్చిపెడుతుందన్న విశ్వాసం, నమ్మకాన్ని యువతలో కల్పించాలని అన్నారు. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రోబోటిక్ వంటి సాధనాలతో విత్తనం నాటే మొదలు పంట చేతికొచ్చే వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తేనే దేశానికి ఆహార భద్రత సమకూరుతుందని అన్నారు. సదస్సులో పలువురు శాస్త్రవేత్తలు రోబోటిక్ పని విధానం వ్యవసాయానికి ఏ మేరకు దోహదపడుతుందనే అంశాలను వివరించారు. సదస్సులో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు జి కరుణాసాగర్, డిడి స్మిత్, ఐ శ్రీనివాస్, సి రమణ , కెవిఎస్ రామిరెడ్డి, బి హరిబాబు, జి వీరప్రసాద్, విజయ్ కుమార్, బి రాజ్ కిరణ్, ఎం మాధవ, లావణ్య, కృపావతి, విష్ణువర్ధన్, ఆర్ గణేష్ బాబు, రత్నరాజు పాల్గొన్నారు.

➡️