కడదాక చిత్రాలు నిర్మిస్తూనే వుంటాను : నిర్మాత సి.కళ్యాణ్

Dec 8,2023 18:50 #Interview, #producer, #telugu movies
producer c kalyan interview

‘కళ్యాణ్ అమ్యూస్మెంట్‌ పార్క్‌’ చిరస్థాయిగా నిలిచిపోతుంది.

‘’గత రెండేళ్ళుగా నా పూర్తి ఏకాగ్రత చెన్నైలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ కళ్యాణ్ అమ్యూస్మెంట్‌ పార్క్‌’పై వుంది. త్వరలోనే అది ప్రారంభమౌతుంది. బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాం. ఆయన ఎప్పుడు సినిమా చేద్దామంటే అప్పుడు చేయడానికి సిద్ధంగా వున్నాం’’ అన్నారు ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్. శనివారం(డిసెంబర్ 9) ఆయన పుట్టిన రోజు సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

కళ్యాణ్ గారు.. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అండీ
-థాంక్యూ వెరీ మచ్..

ఈ బర్త్ డే విశేషాలు ఏమిటి సార్ ?
సహాయ దర్శకుడిగా నా కెరీర్ మొదలైయింది. దాదాపు 83 చిత్రాలని చాలా విజయవంతంగా చేశాం. నెక్స్ట్ బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాం. ఆయన ఎప్పుడు సినిమా చేద్దామంటే అప్పుడు చేయడానికి సిద్ధంగా వున్నాం. బాలకృష్ణ గారితో సినిమా చేయాలనేది మా కోరిక. నిర్మాతని నిర్మాతగా గౌరవించే కథానాయకుడు ఆయన. అందుకే బాలకృష్ణ గారు అంటే మాకు చాలా అభిమానం.

గత రెండేళ్ళుగా నా పూర్తి ఏకాగ్రత చెన్నై లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కల్యాణ్‌ అమ్యూస్మెంట్‌ పార్క్‌’పై వుంది. తమిళ్ న్యూ ఇయర్స్ డేకి ఆవిష్కరించాలని చాలా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రి గారికి కూడా ఈ ప్రాజెక్ట్ ని త్వరగా ప్రారంభించాలనే ఉత్సాహంగా వుంది. ఎందుకంటే సిటీలో ఇలాంటి ప్రాజెక్ట్ రావడం అనేది ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ప్రభుత్వం, అధికారులు, అక్కడి ప్రజల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. చిరస్థాయిగా నిలిచిపోయే ప్రాజెక్ట్ ఇది. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ ని నిర్మించే అవకాశం రావడం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. కళ్యాణ్ అమ్యూస్మెంట్‌ పార్క్‌ అద్భుతంగా వుంటుంది. చాలా వినోదాన్ని పంచుతుంది. ఇండియాలో తొలిసారి అందులో స్కై థియేటర్ ఏర్పాటు చేస్తున్నాం. కళ్యాణ్ అమ్యూస్మెంట్‌ పార్క్‌ ప్రారంభం తర్వాత మంచి ఆదాయాలు సంపాదిస్తామనే నమ్మకం వుంది. వచ్చిన ఆదాయాన్ని సినిమాల నిర్మాణం కోసం ఖర్చు చేస్తాం. కడదాక సినిమాలు తీస్తూనే వుంటాం.

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరిశ్రమ తరపున కలుస్తారా ? పరిశ్రమకు ఏపీ ప్రభుత్వ సహకారం గురించి ?
తప్పకుండా వెళ్లి కలుస్తాం. చిరంజీవితోపాటు జగన్ ని కలిసినప్పుడు కూడా చాలా సానూకూలంగా స్పందించారు. సినిమా వాళ్ళని వదులుకోను. అందరికీ స్థలాలు ఇస్తాను. ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ చేయండని ఓపెన్ గా చెప్పారు. కళ్యాణ్ అమ్యూస్మెంట్‌ పార్క్‌ లాంటి ప్రాజెక్ట్ ని ఏపీలో నిర్మించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను.

వైజాగ్ లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిద్దామనే ప్రపోజల్ పెట్టాను. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగడం లేదు. దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే విశేషమైన గుర్తింపు వస్తుంది. దాన్ని మళ్ళీ జరపమని రేవంత్ రెడ్డిని కోరుతాను. అలాగే చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ని హైదరాబాద్ కు తీసుకురమ్మని రిక్వెస్ట్ చేస్తాను.

మీకు అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన వుంది కదా ? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దేని వలన పెరిగిందని భావిస్తున్నారు ?
ఒకటని కాదండీ. దేనిమీద నియంత్రణ లేకుండాపోయింది. కొన్నాళ్ళు షూటింగులు ఆపి పెద్ద సినిమాల్లో డబ్బు ఎక్కడ వృధా అవుతుందని గమనించారు కానీ అలా చేస్తే సినిమాలు తీసే పరిస్థితి వుండదనే భావనలోకి వచ్చి మళ్ళీ యధావిధిగా కొనసాగిస్తున్నారు. హిందీలో అరవై రోజుల్లో ఒక సినిమా పూర్తవుతుంది. ఇక్కడ అలాంటి సిస్టమ్ ఏమీ లేదు.

ఓటీటీ ఈజ్ ఫ్యూచర్ అంటున్నారు కదా ? ఓటీటీ కొలాబరేషన్ తో వెబ్ సిరిస్ చేసే ఆలోచన ఉందా?
నేను ఎప్పడూ సినిమా ధోరణిలోనే వుంటాను. వెబ్ సిరిస్ కూడా సీరియల్ లానే. ఐతే దానికి బెటర్ వెర్షన్ తీస్తున్నారు. అయితే అలాంటి శ్రుతిమించిన కంటెంట్ నేను చేయలేను. రానురాను డిజిటల్ రైట్స్ తగ్గిపోతాయి. హీరోలు కూడా ఎక్కువగా వెబ్ సిరిస్ ల వైపు వెళ్తారని భావిస్తాను.

బిజినెస్, కలెక్షన్స్, రికార్డ్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక కళాకారుడికి గుర్తింపుగా ఇవ్వాల్సిన అవార్డుల వేడుకలు తగ్గిపోవడాన్ని ఎలా చూస్తారు ?
నిజాయితీగా చెప్పాలంటే అవార్డు తీసుకున్న ఆర్టిస్ట్ కూడా ఇది తనకి ఒక గౌరవమని గొప్పగా భావించే పరిస్థితి లేదని నా అభిప్రాయం. అవార్డులని జెన్యూన్ గా ఇచ్చిన రోజులు వున్నాయి. అవార్డు వేడుక అంటే పరిశ్రమ అంతా ఒక కుటుంబంలా హాజరవ్వాలి. మన పండగ అనుకోవాలి. ఒకప్పుడు అలా జరిగేవి. ఇప్పుడు అవార్డు వచ్చిన వారు తప్పితే మిగతా అందరూ ఇంట్లో కూర్చునే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో అవార్డులు వేడుకలు ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమతోంది.

మీ కొత్త ప్రాజెక్ట్ గురించి ?
బాలకృష్ణతో సినిమా 2024లో మొదలుపెడతామని భావిస్తున్నాం. అలాగే మరో రెండు చిన్న సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

➡️