ఢిల్లీ సిఎం వ్యక్తిగత కార్యదర్శి, ఎంపిల నివాసాలపై ఇడి దాడులు

 న్యూఢిల్లీ :    ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి, రాజ్యసభ ఎంపి, సహా పలువురు ఆప్‌ నేతల నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సోదాలు జరుపుతోంది. మనీలాండరింగ్‌ ఆరోపణలపై మంగళవారం ఉదయం నుండి ఢిల్లీ, చండీగఢ్‌, వారణాసి సహా 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌ కుమార్‌, రాజ్యసభ ఎంపి ఎన్‌.డి. గుప్తా, ఢిల్లీ జల్‌ బోర్డ్‌ మాజీ సభ్యుడు శలభ్‌ కుమార్‌ల ఇళ్లు, కార్యాలయాల్లో ఇడి దాడులు చేపడుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ దాడులపై ఆప్‌ మంత్రి అతిషి మండిపడ్డారు. మీడియాలో మాట్లాడుతూ.. ఈ దాడులతో తాము భయపడేది లేదని అన్నారు. ఇప్పటివరకు అవినీతి జరిగినట్లు తగిన ఆధారాలను సేకరించలేకపోయారని మండిపడ్డారు.

జల్‌ బోర్డులో కుంభకోణం జరిగినట్లు ఇడి ఆరోపిస్తోంది. సిబిఐ నమోదు చేసిన కేసులో రెండు మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఇడి విచారణ జరుపుతోంది. ఈ కేసులో జల్‌బోర్డుకు చెందిన ఇద్దరు మాజీ చీఫ్‌ ఇంజనీర్లను గతంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

➡️