ఇజ్రాయిల్‌ మారణకాండను ఖండించిన ప్రియాంకగాంధీ

Dec 7,2023 13:17 #Gaza, #priyanka gandhi

న్యూఢిల్లీ :   గాజాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ గురువారం ఖండించారు. భారత్‌ న్యాయం వైపు నిలబడాలని ఆమె మోడీ ప్రభుత్వానికి సూచించారు. గాజాపై ఇజ్రాయిల్‌ ”కనికరంలేని బాంబు దాడి ” సంధికి ముందు కంటే మరింత క్రూరత్వంతో విరుచుకుపడుతోందని అన్నారు. న్యాయం వైపు నిలబడటం మరియు సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణను ప్రకటించేలా చర్యలు చేపట్టడం అంతర్జాతీయ సమాజంలో సభ్యునిగా ఉన్న భారత దేశం యొక్క కనీస విధి అని స్పష్టం చేశారు.  భారత్‌ ఎప్పుడూ న్యాయం కోసం నిలబడిందని, పాలస్తీనా చేపడుతున్న సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాటానికి ప్రారంభం నుండి మద్దతు ఇచ్చిందని ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ఒప్పందం ముందు కంటే ఇజ్రాయిల్‌ మరింత క్రూరంగా విరుచుకుపడుతోందని పేర్కొన్నారు. వైద్య సదుపాయాలను ధ్వంసం చేసిందని, ఆహారంతో పాటు కనీస సౌకర్యాలు అందకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు.

పాలస్తీనా మొత్తం తుడిచిపెట్టుకుపోతోందని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10,000 మంది చిన్నారులు, 60కిపైగా జర్నలిస్టులు మరియు వందలాది మంది వైద్య సిబ్బంది సహా 16,000 మంది అమాయక పౌరులు హత్య చేయబడ్డారని అన్నారు. ” వారు కూడా మనందరిలాగే కలలు, ఆశలు కలిగిన వ్యక్తులు, మన కళ్లముందే నిర్దాక్షిణ్యంగా హత్యకు గురవుతున్నారు. మన మానవత్వం ఎక్కడుంది ” అని ప్రశ్నించారు. ”దక్షిణాఫ్రికాలోని వర్ణవివక్ష పాలనకు వ్యతిరేకంగా మనం వారి ఆంక్షల కోసం పోరాడాం. పాలస్తీనాలోని మన సోదరులు, సోదరీమణులు చేస్తున్న స్వాతంత్య్ర పోరాటానికి ప్రారంభం నుండి మద్దతిస్తున్నాం. ప్రస్తుతం పాలస్తీనా భూమి పై నుండి వారిని తుడిచిపెట్టేందుకు మారణహోమం జరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నాం” అని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ వేదికపై నిలబడటం భారత్‌ కర్తవ్యమని ప్రియాంక పునరుద్ఘాటించారు.

➡️