రాజకీయ ప్రకటనలకు ముందస్తు ఆమోదం తప్పనిసరి 

Feb 16,2024 08:30 #AP CEO, #Election Rules
  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చే రాజకీయ ప్రకటనలు తప్పనిసరిగా ఎంసిఎంసి కమిటీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లా ఎంసిఎంసి కమిటీలు, రాష్ట్ర స్థాయిలో ప్రసారం చేయదలచిన ప్రకటనలకు రాష్ట్ర కమిటీ అనుమతులు వుండాలన్నారు. గురువారం మధ్యాహ్నం రాజకీయ ప్రకటనల విషయంపై ఎంకె మీనా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్‌ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలచిన తేదీకి కనీసం మూడు రోజుల ముందు రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో కమిటీ నిర్ణయం తీసుకుంటుం దన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా రాజకీయ ప్రకటనలపై ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంసిఎంసి కమిటీ సభ్యులు అడిషనల్‌ సిఇఒ కోటేశ్వరరావు, దూరదర్శన్‌ కేంద్రం విజయవాడ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జి కొండలరావు, పిఐబి మీడియా కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ టి హెన్రీ రాజ్‌, సిపిఎం నుంచి వై వెంకటేశ్వరరావు, జయరామ్‌, వైసిపి నుంచి నాగిరెడ్డి, నారాయణ మూర్తి, టిడిపి నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️