అక్రమాలకు అడ్డుకట్టేది..?

Mar 1,2024 12:14
  • సబ్సిడీ అక్రమ బియ్యానికి హోళగుంద అడ్డా
  • గవి సిద్ధేశ్వర రైస్‌ మిల్లులో జోరుగా దందా
  • రూ.లక్షల్లో అక్రమార్జన
  • చోద్యం చేస్తున్న అధికారులు

ప్రజాశక్తి – హోళగుంద (కర్నూలు) : ప్రభుత్వం పేదలకు అందించే సబ్సిడీ బియ్యాన్ని కారు చౌకగా కొని పాలీష్‌ చేసి అక్రమార్కులు దర్జాగా సొమ్ము చేసు కుంటున్నారు. కార్డుదారుల నుంచి చిన్న, చిన్న వ్యాపా రులు రూ.15లకు కొనుగోలు చేసి రైస్‌ మిల్లులో రూ.20 విక్రయి స్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో పడి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎమ్‌డియు ఆపరేటర్ల చేతివాటం

                 మండలంలో 17 పంచాయతీలకు గాను 32 రేషన్‌ షాపులు ఉన్నాయి. 17,204 మంది కార్డుదారులు ఉన్నారు. మండలానికి నెలకు 2,597.38 క్వింటాళ్ల బియ్యం అలాట్‌మెంట్‌ అవుతోంది. ఇంటింటికీ మొబైల్‌ వాహనం ద్వారా రేషన్‌ అందించే ఎమ్‌డియు ఆపరేటర్లు బియ్యం పంపిణీలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తూకంలో మోసం చేసి కార్డుదారుల నుంచి బియ్యాన్ని నొక్కేస్తున్నారు. గతంలో రేషన్‌ డీలర్లు ఈ తతంగాన్ని నడిపేవారు. ప్రస్తుతం ఎమ్‌డియు ఆపరేటర్లు ఈ వ్యవహారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా మార్చుకుని దోచుకుంటున్నారు. కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని రైస్‌ మిల్‌ యజమానులకు కిలో రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది కింటాళ్లలో రైస్‌మిల్‌కు తరలించి రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. ఒక్క హోళగుంద మండలం నుంచే నెలకు 1200 కింటాళ్ల వరకు సబ్సిడీ బియ్యం అక్రమంగా బ్లాక్‌మార్కెట్‌కు చేరుతున్నట్లు సమాచారం. ఎమ్‌డియు ఆపరేటర్ల చేతివాటం, గ్రామాల్లో చిన్న, చిన్న వ్యాపారులు కొనుగోలు చేసిన 1200 కింటాళ్ల బియ్యం ఒక్క హోళగుంద నుంచే అక్రమంగా తరలి వెళ్తోంది. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతినెలా 820 మెట్రిక్‌ టన్నుల బియ్యం అలాట్‌మెంట్‌ అవుతోంది. 53,927 మంది కార్డుదారులు ఉన్నారు.

గవి సిద్ధేశ్వర రైస్‌ మిల్‌లో జోరుగా దందా

                హోళగుంద గవి సిద్ధేశ్వర రైస్‌ మిల్లులో అక్రమ బియ్యం దందా జోరుగా సాగుతోంది. చిన్న, చిన్న వ్యాపారులు, ఎమ్‌డియు ఆపరేటర్లు కిలో రూ.20 ప్రకారం రైస్‌ మిల్‌ యజమానికి అమ్ముతున్నారు. ఈ రైస్‌ మిల్లులో సబ్సిడీ బియ్యాన్ని డబుల్‌ పాలీష్‌ చేసి చిన్న బియ్యంగా మార్చి కిలో రూ.40 ప్రకారం బహిరంగ మార్కెట్‌లో అమ్ముతున్నట్లు సమాచారం. ప్రతినెలా 8 నుంచి 10 లారీల వరకు పాలీష్‌ చేసిన బియ్యం పక్కనున్న కర్ణాటక రాష్ట్రానికి తరలించి గవి సిద్ధేశ్వర రైస్‌మిల్‌ యజమాని రూ.లక్షల్లో సంపాదిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

చోద్యం చూస్తున్న అధికారులు

                  సబ్సిడీ రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నా అధికారులు మామూళ్ల మత్తులో పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పట్టుకొని రాజకీయ నాయకులకు ఒత్తిడితో వదిలిపెట్టినట్లు సమాచారం. ఈ అక్రమ బియ్యం వ్యాపారం వెనుక బడా నాయకుల హస్తం ఉన్నట్లు తెలిసింది. జిల్లా అధికారులు స్పందించి సబ్సిడీ బియ్యం అక్రమ రవాణాన్ని అడ్డుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా.. పేదల తిండికి ఉపయోగపడేలా చూడాలని ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం : తహశీల్దార్‌ ప్రసాద్‌ రాజా

సెల్‌ఫోన్‌ ద్వారా తహశీల్దార్‌ను ప్రజాశక్తి సంప్రదించింది. నేను విజయవాడలో శిక్షణలో ఉన్నాను. గవి సిద్ధేశ్వర రైస్‌ మిల్లులో సబ్సిడీ బియ్యం పాలీష్‌ చేయడం, నిల్వ ఉంచడంపై ఆర్‌ఐ ద్వారా విచారణ చేపడతాం. విచారణలో గుర్తిస్తే చర్యలు తీసుకుంటాం.

➡️