వాహన పరిశ్రమపై హెచ్చు వడ్డీ రేట్ల ఒత్తిడి

Apr 8,2024 21:55
  • చిన్న కార్లపై మరింత ప్రతికూలత
  • ఎఫ్‌ఎడిఎ ఆందోళన

న్యూఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) వరుసగా 14 మాసాల నుంచి వడ్డీ రేట్లను తగ్గించకపోవడంతో వాహన పరిశ్రమపై ఒత్తిడి నెలకొందని ఆ రంగం డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. అన్ని వాహనాల రిటైల్‌ అమ్మకాలపై ప్రభావం పడుతోందని.. ముఖ్యంగా చిన్న, ప్రవేశ స్థాయి వాహన కొనుగోలుపై హెచ్చు వడ్డీ రేట్లు ఒత్తిడిని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24లో 42 లక్షల ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు జరిగాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఎడిఎ) సోమవారం వెల్లడించింది. రేపోరేటు యథాతథంగా కొనసాగింపునతో ప్రాథమిక స్థాయి వాహనాలపై ఒత్తిడి ఎక్కువగా ఉందని తెలిపింది.
ఎఫ్‌ఎడిఎ రిపోర్ట్‌ ప్రకారం.. 2023-24లో ద్విచక్ర వాహన అమ్మకాలు ఇప్పటికీ కోవిడ్‌ ముందు స్థాయి కంటే వెనుకబడి ఉన్నాయి. చిన్న కార్ల విభాగం అమ్మకాల్లో 3 శాతం తగ్గుదల నమోదవుతోంది. కొన్ని సంవత్సరాల క్రితంతో పోల్చితే 30 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ మారుతి సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సి భార్గవ ఎప్పటిలాగే ఆశాజనకంగా ఉన్నారు. ఎంట్రీ లెవల్‌లో కస్టమర్ల ఆదాయం పెరగడంతో 2026 నాటికి చిన్న కార్లకు మరింత డిమాండ్‌ పెరగొచ్చని భార్గవా పేర్కొన్నారు.
అధిక ద్రవ్యోల్బణానికి తోడు విత్త రేట్లలోనూ ఉపశమనం లేకపోవడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఎఫ్‌ఎడిఎ పేర్కొంది. రాబోయే ఎన్నికలతో పాటు, ఈ సవాళ్లు పరిశ్రమను ప్రభావితం చేస్తాయని విశ్లేషించింది. అన్ని విభాగాలలో వాహనాల అమ్మకాలపై ఒత్తిడి ఉండొచ్చు. ప్రస్తుతం 2024-25లో ఆశావాదం, సవాళ్ల మిశ్రమం మధ్య ఆటో పరిశ్రమ వృద్థి స్థిరంగా ఉండొచ్చని ఎఫ్‌ఎడిఎ ప్రెసిడెంట్‌ మనీష్‌ రాజ్‌ సింఘానియా అంచనా వేశారు. ప్రభుత్వ వ్యయంతో పాటు అనుకూలమైన ప్రభుత్వ విధానాలు, మంచి రుతుపవనాలు ఈ సంవత్సరం డిమాండ్‌ను పెంచుతాయని ఆశిస్తున్నామన్నారు. ఉగాది పండగ సందర్బంగా ఏప్రిల్‌లో అమ్మకాలు ఆశాజనకంగా ఉండొచ్చన్నారు. ఎన్నికల ప్రకటన తర్వాత వాణిజ్య వాహనాల కొనుగోళ్లలో తాత్కాలిక తగ్గుదల కనబడిందన్నారు.

➡️