ఎన్నికలకు సన్నద్ధం – వ్యవస్థపై సందేహం

ఎన్నికల నోటిఫికేషన్‌ వేళ వాటిని నిర్వహించవలసిన ఎన్నికల సంఘమే అనుమానాస్పద స్థితిలో చిక్కుకోవడం భారతదేశంలో ఒక విపరీతం. ఎన్నికల అక్రమాలు, అవతకతవకలు, ఒత్తిళ్లు కొత్త కాకపోయినా అసలు ఆ రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకోవడమే పెద్ద సవాలుగా మారిందంటే మోడీ హయాంలో పరిస్థితి ఎలా తలకిందులైందీ తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ధర్మాసనం సూచనలు కూడా పెడచెవిన పెట్టడం, ఎన్నికలను ప్రభావితం చేసే నిగూఢ విరాళాల సమస్య ఈ సమయంలోనే ముందుకు రావడం, సాక్షాత్తూ ఒక మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఎన్నికల మౌలిక సూత్రాలను ఇష్టానుసారం మార్చేసేందుకు రాజ్యాంగేతర తరహాలో సిఫార్సులను ప్రస్తుత రాష్ట్రపతి స్వీకరించడం ఇందులో ప్రతిదీ ఊహకందని స్థాయిలో జరుగుతున్నది. విడివిడిగా కనిపించే ఈ పరిణామాల మధ్య అగుపించని ఒక అదృశ్య సంబంధం వుంది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఎలాంటి నిర్దిష్ట నిబంధనలు లేవని సుప్రీం కోర్టు చాలాసార్లు అసంతృప్తి వెలిబుచ్చింది. కానీ మోడీ హయాంలో మిగిలిన రంగాలలో వలెనే ఇక్కడా ఏకపక్ష ధోరణి ముదిరిపోయింది. సిబిఐ, ఇడి, సివిసి వంటి పదవుల్లో ఆశ్రితులను నియమించి ప్రతిపక్షాలపై ప్రయోగించే ధోరణి పరాకాష్టకు చేరింది. ఎన్నికల సంఘం విషయంలో ఏకపక్ష నియామకాలు జరగకుండా ఒక నియామక ప్రక్రియ నిర్దేశించాలని కోరుతూ ఎడిఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌) తరపున 2022లో ఒక పిటిషన్‌ దాఖలైంది. దీన్ని త్రిసభ్య రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుండగానే సిఇసి అరుణ్‌ పాండే పదవీ విరమణ వచ్చింది. ఆ సమయంలోనే అరుణ్‌ గోయెల్‌ అనే కార్యదర్శి తన పదవి నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం, 24 గంటల్లోనే సిఇసిగా నియమించడం జరిగిపోయాయి.
ఎందుకింత హడావుడి?
సుప్రీం కోర్టు ఒకవైపున విచారిస్తుండగానే ఇంత హడావుడి దేనికని తీవ్ర విమర్శలు వచ్చాయి. సిఇసి పదవీ కాలం ఆరేళ్లు లేదా 65 ఏళ్లు నిండడం. ఇందులో ఏ కొలబద్దతో చూసినా గోయెల్‌ ఎంపికయ్యే అవకాశముండదు. తమ ముందుకు వచ్చిన నాలుగు పేర్లలోనూ గోయెల్‌ చిన్నవారు గనక తనను నియమించినట్టు అడ్వకేట్‌ జనరల్‌ సమర్థించుకున్నారు. ఈ నియామకాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలైనప్పుడు కేంద్రం అధికారాన్ని ప్రశ్నించలేమని కోర్టు చెప్పింది. అయితే ఎడిఆర్‌ కేసులో దీనిపై సమగ్ర తీర్పు వస్తుందని కూడా సూచించింది. తీరా ఆ కేసు విచారణకు వచ్చినపుడు ఎజిఆర్‌ వెంకట్రామన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకపక్షంగా సమర్థించారు. రాజ్యాంగం సిఇసి నియామకంపై ఎలాంటి నిర్దేశకాలూ చేయలేదని వాదించారు. ఏమీ చెప్పనప్పుడు మరింత జాగ్రత్తగా వుండాలని, దీనిపై ఏవైనా మార్గదర్శకాలు ఇస్తామని సుప్రీంకోర్టు చెప్పగా అలా జోక్యం చేసుకోవాలని న్యాయ వ్యవస్థకు అధికారం ఇవ్వలేదని కూడా ఆయన అభ్యంతరం చెప్పారు. జస్టిస్‌ జోసఫ్‌ అధ్యక్షతన గల ధర్మాసనం దీనిపై తీర్పునిస్తూ సిఇసి నియామకంలో అనుసరించాల్సిన సూత్రాలపై పార్లమెంటు చట్టం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇచ్చిన తీర్పులో న్యాయమూర్తి రాజ్యాంగం సిఇసి కి ఎంత ప్రత్యేక స్థానం ఇచ్చిందో అంబేద్కర్‌ మాటల్లోనే ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలు సక్రమంగా జరగడమనీ, దానికి ఎన్నికల సంఘం కీలకమని అంబేద్కర్‌ అప్పట్లో పేర్కొన్నారు. కాగ్‌ వంటివాటితో పోలిస్తే ఎన్నికల సంఘం అత్యంత ముఖ్యం గనకే అందుకు ప్రత్యేక నియామక పద్ధతిని రాజ్యాంగం చెప్పిందనీ, ఇందుకు స్వతంత్రత అనేది కొలబద్ద అని స్పష్టం చేశారు. సిఇసి కార్యనిర్వాహక వర్గానికి లోబడి వుండకూడదనేది కీలక సూత్రం. పార్లమెంటు చట్టం చేసేలోగా కూడా స్వతంత్రత కాపాడేందుకు గాను ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన కమిటీ రాష్ట్రపతికి సూచనలను చేయాలని నిర్దేశించారు.
తీర్పు స్ఫూర్తికి తూట్లు
ఏ తీర్పులోనైనా రెండు భాగాలుంటాయి. ఒకటి ఒబిటర్‌ డిక్టా, రెండు రేషియో డిసిడెండి. మొదటిది ఆదేశపూర్వకం. తప్పక అమలు చేయాలి. రెండోది ఆ తీర్పునకు మూలమైన స్ఫూర్తి వివరణ. ఈ తీర్పులో కేంద్రం చట్టంచేయాలన్నది ఆదేశమైతే సిఇసి స్వతంత్రత కాపాడాలనేది స్పూర్తి. సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తిని భాగస్వామిగా చేయడం ద్వారా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. అయినా మోడీ సర్కారు పొంతన లేని వాదనలతో కొత్త బిల్లు తీసుకొచ్చింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్లు(నియామక షరతులు, సర్వీసు పదవీ నిబంధనలు) బిల్లు-2023 పేరిట వచ్చిన ఈ బిల్లును రాజ్యసభ డిసెంబర్‌ 12న ఆమోదించింది. ప్రధానమంత్రి అధ్యక్షులుగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నియమించే మరో కేంద్ర మంత్రి సభ్యులుగా కమిటీ ఈ ఎంపిక కోసం రాష్ట్రపతికి పేరు సిఫార్సు చేస్తుంది. ఇప్పటికే కార్యదర్శులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన వారే ఈ పదవికి అర్హులుగా వుంటారు. అంటే నియమించే కమిటీలో ప్రధాని మాట అమలవుతుంది. నియామకానికి అర్హులైన వారు కూడా ఆ ప్రభుత్వంలో పనిచేసిన వారే అయివుండాలి. ప్రధాన న్యాయమూర్తిని భాగస్వామిగా వుంచాలని కోర్టు సూచనగా చెబితే దాని బదులు ప్రధాని నియమించే కేంద్ర మంత్రికి సభ్యత్వం కల్పించింది.. ప్రతిపక్ష నాయకుడికి నామకా స్థానం కల్పించినా మెజారిటీ అధికార పార్టీకే వుంటుందనేది స్పష్టం. ప్రధాన కమిషనరుగా, కమిషనర్లుగా నియమించబడేవారికి సుప్రీంకోర్టు జడ్జిలతో సమానంగా జీతభత్యాలు వుండాలని తీర్పులో చెబితే ప్రభుత్వం మొదట కార్యదర్శి స్థాయి వేతనం మాత్రమే ప్రతిపాదించింది. ప్రతిపక్షాల విమర్శల తర్వాతనే దాన్ని ఆ స్థాయికి చేరుస్తూ సవరణ తెచ్చారు..కమిషన్‌ సభ్యులకు విధి నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలకుగాను కేసులు పెట్టే అవకాశం, తొలగింపు అధికారం లేకుండా చేయాలన్న సూచనను కూడా ఆమోదించలేదు. ఒక్క సిఇసికి మాత్రమే సుప్రీంకోర్టు జడ్జిల తరహాలో కేసుల నుంచి రక్షణ కల్పించబడింది. కోర్టుల జోక్యం కన్నా రాజకీయ జోక్యమే ఎన్నికల సంఘానికి సవాలు గనక ఆ ఒత్తిడి ఆలాగే వుంటుందన్న మాట. ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి ఎన్నికల సంఘ బిల్లు తెచ్చారని ఎంపిలు విమర్శించగా రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ఆగ్రహించారు. సభలో మనం స్వతంత్రంగా నిర్ణయాలు చేయాలి గాని, ఎవరి పెత్తనం మనపై వుండరాదని సూక్తులు చెప్పారు.వాస్తవంగా జరిగింది వేరు.
అయితే ఈలోగా ఏరికోరి నియమించుకున్న కమిషనర్‌ అరుణ్‌గోయెల్‌ మార్చి 9న రాజీనామా చేయడంతో కథ కొత్త మలుపు తిరిగింది..ఎన్నికల ఏర్పాట్లు తారాస్థాయికి చేరుతున్న సమయంలో ఆయన సిఇసి రాజీవ్‌ కుమార్‌ నుంచి విడగొట్టుకున్నారు. ఆయన రాజీనామా చేయడం, ఆమోదించినట్టు రాష్ట్రపతి గెజిట్‌ విడుదల చేయడం ఆఘమేఘాల మీద జరిగిపోయింది. గతంలో అంటే 2020 ఆగస్టులో అవోక్‌ లావసా అనే ఎన్నికల కమిషనర్‌ కూడా రాజీనామా చేశారు. 2019 ఎన్నికలలో మోడీ, అమిత్‌షాలు ఎన్నికల ప్రచార నిబంధనలను ఉల్లంఘించినందుకు నిరసనగా ఆయన రాజీనామా చేశారు. (తర్వాత ఆయనపై ఐటి తదితర దాడులు జరిగాయి. కొంతకాలానికి ఆయన ప్రభుత్వ అండదండలుండే ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఉపాద్యక్షుడుగా నియమితుడైనాడు.) మోడీ హయాంలో ఈ విధంగా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు రాజీనామా చేయడం అసాధారణమే. ఇందుకు కారణాలు మాత్రం పూర్తిగా రహస్యంగా వుండిపోయాయి..
ప్రతిపక్ష నేత చెప్పిన సత్యాలు
ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల ముందు ఇద్దరు కొత్త కమిషనర్లను నియమించిన తీరు కూడా చాలా అభ్యంతరకంగా వుంది.14వ తేదీన ఈ నియామకానికి నిర్ణయించడానికి గాను ప్రధాని, హోంమంత్రి అమిత్‌ షా, ప్రతిపక్ష నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరి సమావేశమైనారు. మాజీ ఐఎఎస్‌ అధికారులైన సుఖ్‌వీర్‌ సింగ్‌ సంధు, జ్ఞానేశ్‌ కుమార్‌లు నియమితులైనట్టు అధీర్‌ వెల్లడించారు. దీన్ని వెంటనే అధికారికంగా ధృవీకరించలేదు. వాస్తవానికి ఈ నియమాకం దౌర్జన్య తరహా రిగ్గింగ్‌ పద్ధతిలో జరిగిందని ఆయన విమర్శించారు. తనకు 212 మంది అధికారుల జాబితాను సమావేశానికి ముందు రోజు రాత్రి ఇస్తే ఎలా పరిశీలించగలనని ఆయన ప్రశ్నించారు. ఇక సమావేశానికి పది నిముషాల ముందు, ఇందులో పదిమంది పేర్లతో మరో చిన్న జాబితా ఇచ్చి ఎంపిక చేయమని కోరారనీ, ఇందులో మళ్లీ ఆరుపేర్లు ప్రతిపాదించి, మెజారిటీ నిర్ణయంగా పై ఇద్దరినీ ఎంపిక చేశారని వెల్లడించారు .ప్రభుత్వం ముందే నిర్ణయించుకున్న పేర్లనే అక్కడ ఆమోదించినట్టు ప్రహసనం నడపించారని ఆయన స్పష్టం చేశారు.ఎన్నికల కమిషనర్ల స్థానాలు ఖాళీగా వుండరాదనే ఉద్దేశంతోనే తాను సమావేశానికి హాజరయ్యానని వివరించారు. కనుక అందరూ భయపడినట్టే ఇది పూర్తిగామోడీ కనుసన్నలలో జరిగిన వ్యవహారం తప్ప ఎంపిక ఏమీ లేదన్నమాట. మరి ఇలాటి కమిషన్‌ కీలకమైన ఎన్నికల నిర్వహణ ఏ విధంగా చేస్తుందో చెప్పనవసరం లేదు.
ఇప్పటికే ఓటరు వేసిన ఓటు నిర్దేశించిన అభ్యర్థికే పడుతుందో, లేదో పరిశీలించేందుకు ఉద్దేశించిన వివి పాట్‌ వివాదం అలాగే వుంది. అసలు ఇవిఎంల పనితీరుపైనే బోలెడు ప్రశ్నలున్నాయి. ఇటీవలనే ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పూర్తి అమలు కావలసే వుంది. ఈ బాండ్ల అమ్మకాలు పంపిణీ వివరాలు ఎన్నికల సంఘానికి అందించాలని సంబంధిత స్టేట్‌బ్యాంకును అడిగితే మరింత సమయం కావాలని కోరి అక్షింతలు వేయించుకుంది. సుప్రీం అక్షింతలు వేశాక అనివార్యంగా స్టేట్‌ బ్యాంకు ఇసికి అందజేసిన వివరాలు అరకొరగా వుండటంతో మళ్లీ ఆగ్రహం వెలిబుచ్చాల్సి వచ్చింది. అందిన మేరకు చూసినా బిజెపి కార్పోరేట్‌ ప్రాపకం తెలిసిపోయింది. మొత్తం 12వేలకోట్ల రూపాయలకు పైగా బాండ్లు కార్పోరేట్‌ సంస్థలు కొంటే.. అందులో ఆరువేల కోట్లపైన బిజెపి కే చేరాయి.కాంగ్రెసు 1400 కోట్లు, కమ్యూనిస్టు వ్యతిరేక తృణమూల్‌ తర్వాత స్థానంలో 1200 కోట్ల వరకూ పొందాయి. (ఈ వివరాలు ప్రజాశక్తి ఇచ్చింది) అయితే అవినీతిపై పోరాటం అంటూ చిందులు తొక్కే అమిత్‌ షా 303 మంది ఎంపిలు వున్న మా పార్టీకి ఈ మాత్రం విరాళం. వస్తే ఏం తప్పు?అని ఎదురు దాడి మొదలెట్టారు.ఏమైనా జాతీయ, ప్రాంతీయ పాలక పార్టీలన్నీ ఈ ప్రభావంలో వున్నాయి. ఈ మురికి అంటని పార్టీ సిపిఎం. ఇంత ప్రభావం చూపే ధనపు సంచులు, ఇంత తప్పు పద్ధతిలో కమిషనర్ల నియామకం మధ్య విశ్వసనీయత ఏమయ్యేట్టు?ఆఘమేఘాల మధ్య నియమితులైన ఇద్దరితో కలసి ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ బృహత్‌ ఎన్నికల కార్యక్రమం ప్రకటించారు. ఏప్రిల్‌ 18న మొదలై జూన్‌ 1న ముగిసే ఈ కీలక సమరం ఫలితాలు జూన్‌ 4న తెలుస్తాయి.మే 13న జరిగే ఎపి ఎన్నికల ఫలితాల కోసం మరింత ఉత్కంఠగా ఎదురు చూడాల్సిందే. కాకుంటే ఈ వివాదాస్పద వాతావరణం దాన్ని మరింత పెంచడం తథ్యం.

 

telakapalli ravi

తెలకపల్లి రవి

➡️