గంగవరం పోర్టు కాలుష్యాన్ని అరికట్టాలి

  • సిపిఎం ఆధ్వర్యాన ధర్నా

ప్రజాశక్తి -గాజువాక (విశాఖపట్నం) : అదాని గంగవరం పోర్టు కాలుష్యాన్ని అరికట్టాలని, విశాఖ జగ్గు జంక్షన్‌ మీదుగా పోర్టు భారీ వాహనాల రాకపోకల నిషేధించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన పాత గాజువాక జంక్షన్‌లో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ.. గాజువాక నియోజకవర్గంలోని 64వ వార్డు నుంచి 88వ వార్డు పరిధిలో సుమారు ఏడు లక్షల మంది ప్రజలు గంగవరం పోర్టు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రసాయనాలు, బొగ్గుతో కూడిన దుమ్ము ధూళి వల్ల చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక వ్యాధికి గురవుతున్నారని చెప్పారు. యారాడ కొండ దాటి మల్కాపురం వరకు కాలుష్యం వెదజల్లుతోందని తెలిపారు. ఈ విషయాన్ని గంగవరం పోర్టు యాజమాన్యం దృష్టికి అనేకసార్లు సిపిఎం తీసుకెళ్లిందని వివరించారు. సిపిఎం గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం రాంబాబు మాట్లాడుతూ.. పోర్టు భారీ వాహనాలు జగ్గు జంక్షన్‌ మీదుగా కాకుండా వేరే మార్గం ద్వారా మళ్లించాలని కోరారు. ఈ రాకపోకలు వల్ల అదే దారిలో ఉన్న మున్సిపల్‌ కార్యాలయం, గాజువాక తహశీల్దార్‌ కార్యాలయాలకు వచ్చే వారు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. సిపిఎం నాయకులు కెఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. సిపిఎం నాయకులు ఎ లోకేశ్వరరావు మాట్లాడుతూ.. పోర్టు యాజమాన్యం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు పాలూరు లక్ష్మణస్వామి, ఎం శ్రీదేవి, పల్లెల నర్సింగరావు పాల్గొన్నారు.

➡️