మన్యం బంద్‌ జయప్రదం

– మూతపడ్డ దుకాణాలు, పర్యాటక కేంద్రాలు

– నిలిచిన ప్రయివేటు వాహనాలు

– జిఒ 3 పునరుద్ధరణ, గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి కోసం గొంతెత్తిన గిరిజనం

ప్రజాశక్తి- యంత్రాంగం: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం మన్యం బంద్‌ విజయవంతమైంది. జిఒ 3 చట్టబద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయాలని, గిరిజన ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలను ఆదివాసీ అభ్యర్థులకే కేటాయించాలని, ప్రత్యేక డిఎస్‌సి ప్రకటించాలని తదితర డిమాండ్లతో ఆదివాసీ గిరిజన సంఘం, ఏజెన్సీ ప్రత్యేక డిఎస్‌సి సాధన కమిటీ ఆధ్వర్యాన తలపెట్టిన ఈ బంద్‌కు ఆదివాసీల నుంచి పూర్తి మద్దతు లభించింది. వర్తక, వాణిజ్య, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బంద్‌లో భాగంగా ఎక్కడికక్కడ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం పోలీసు బందోబస్తుతో కొన్నిచోట్ల ఆర్‌టిసి బస్సులను తిప్పాలని చూసినా జనం వాటిలో పల్చగా కనిపించారు. పలుచోట్ల రోడ్డెక్కిన బస్సులను బంద్‌ నిర్వాహకులు అడ్డుకున్నారు. బంద్‌కు సిపిఎం, టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలతోపాటు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రధాన రహదారులు బోసిపోయాయి. ఆర్‌టిసి కాంప్లెక్స్‌ ప్రాంగణంలో బంద్‌ నిర్వహిస్తున్న ఆదివాసీ గిరిజన సంఘం, గిరిజన సమాఖ్య, గిరిజన డిఎస్‌సి సాధన కమిటీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌ విజయవంతానికి కృషి చేస్తున్న ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ధర్మన్న పడాల్‌, సుందర్‌రావులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరకులోని పర్యాటక కేంద్రాలైన పద్మావతి గార్డెన్‌, గిరిజన మ్యూజియం, రణజిల్లెడ జలపాతం తదితర సందర్శిత ప్రాంతాలు మూతబడ్డాయి. బంద్‌ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ గిరిజన ప్రాంతానికి గుండెకాయ వంటి జిఒ 3 చట్టబద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే వైసిపికి రానున్న ఎన్నికల్లో ఆదివాసీలు ఓటు రూపంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అనంతగిరిలో బర్రా గుహలు మూతపడ్డాయి.

రంపచోడవరంలోనూ బంద్‌ జయప్రదమైంది. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి.కిరణ్‌, నాయకులు మట్ల వాణిశ్రీ ఆధ్వర్యంలో గిరిజనులు అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద రహదారిపై బైఠాయించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట, కొమరాడ, జియ్యమ్మవలస, పార్వతీపురం తదితర మండలాల్లో బంద్‌ జరిగింది. వ్యాపారులు దుకాణాలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. ఏలూరు జిల్లా పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. పోలవరం ఏటిగట్టు, జీలుగుమిల్లిలో జాతీయ రహదారిపై, బుట్టాయగూడెం, కుక్కునూరు ప్రధాన సెంటర్లలో నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సిపిఎం, ప్రజాసంఘాల నేతలు పాల్గని సంఘీభావం తెలిపారు. బంద్‌లో భాగంగా శ్రీకాకుళం జిల్లా గొట్టిపల్లి, మందసలో ర్యాలీలు నిర్వహించారు. స్పెషల్‌ డిఎస్‌సి విడుదల చేయాలని, ఆదివాసీ మాతృభాష విద్యా వలంటీర్లను కొనసాగించాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

 

 

 

 

➡️