పోలవరం నిర్వాసిత కుటుంబాలు 1,06,006

Dec 8,2023 10:38 #polavaram

 

అందులో 56,504 గిరిజన కుటుంబాలు

ఒక్కో గిరిజన కుటుంబానికి రూ.6.86 లక్షలు

2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం, పునరావాసం

కేంద్ర జలశక్తి సహాయ మంత్రి భీశ్వేశ్వర తుడ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు (పిఐపి) నిర్మాణం కారణంగా 1,06,006 కుటుంబాలు నిర్వాసితులయ్యే అవకాశం ఉందని అంచనా వేసినట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి భీశ్వేశ్వర తుడ తెలిపారు. లోక్‌సభలో టిడిపి ఎంపి కె.రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మొత్తం 1,06,006 పోలవరం నిర్వాసిత కుటుంబాలు ఉండగా, అందులో 56,504 కుటుంబాలు షెడ్యూల్డ్‌ తెగలకు చెందినవి అని తెలిపారు. అల్లూరి సీతా రామరాజు జిల్లాలో 43,689 ఎస్‌టి కుటుంబాలు ఉండగా, ఏలూరు జిల్లాలో 12,815 ఎస్‌టి కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. 2005 ఏప్రిల్‌ 8 నాటి ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం 2013 డిసెంబర్‌ వరకు ఈ కుటుంబాలకు పునరావాసం, పరిహారం (ఆర్‌ అండ్‌ ఆర్‌) అందించామని, ఆ తరువాత న్యాయమైన పరిహారం, పునరావాసం, పారదర్శకత భూసేకరణ హక్కు చట్టం 2013 ప్రకారం ఇచ్చామని తెలిపారు. 2013 చట్టం ప్రకారం సగటున ఒక్కో గిరిజన నిర్వాసిత కుటుంబానికి రూ.6.86 లక్షలు, ప్రాజెక్టు కోసం తమ భూమిని కోల్పోయే గిరిజన నిర్వాసిత కుటుంబాలకు ఇందిరా ఆవాస్‌ యోజన ప్రకారం ఇళ్లుతో పాటు సేకరించిన భూమికి సమానమైన భూమి, లేదా రూ.2.5 ఎకరాలు భూమి (ఇందులో ఏది తక్కువైతే అది) అందజేస్తున్నట్లు తెలిపారు. గిరిజన కుటుంబాలు తమ జాతి, భాషా, సాంస్కృతిక గుర్తింపును నిలుపుకునేలా చూడడానికి వీరికి వీలైనంత వరకు గిరిజన ప్రాంతాల్లోనే పునరావాసం ఇస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు (పిఐపి) జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించామని, 2016 సెప్టెంబర్‌ 30న ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం, 2014 ఏప్రిల్‌ 1 నుండి కేంద్ర ప్రభుత్వం నీటిపారుదల ఖర్చులతో సహా 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం భాగం కూడా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోందని అన్నారు. అయితే, పరిహారం, పునరావాసంతో సహా ప్రాజెక్ట్‌ అమలును కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని తెలిపారు.

➡️