పిల్లికూతలు

Mar 24,2024 09:20 #Sneha

‘వాన జోరుగ కురియుచున్నది
వసారా మరి ఎలా వున్నది?’
తలపు మదిలో మెదిలినందున
తలుపు వారగ తీసి చూచితి!!

కుర్చీలోన పులి విధానా
కూర్చొనీ ఒక పిల్లి వున్నది!
పులిని అనుకొని కులుకుచున్నది
చలికి మాత్రం వణుకుచున్నది!!

అపరిశుభ్రం అగును కుర్చీ
అనే భావం నాకు కలిగెను!
పారద్రోలితి పిల్లినప్పుడె
వాన ఇంకా పెరిగెనప్పుడె!!

పరుగు దీసెను పిల్లి మ్యావని
అరుచుకొంటూ వానలోనికి!
పిల్లికూతలలోని భావం
తెల్లమాయెను నాకు ఇట్టుల,

‘ఇంటిలో తిరుగాడు ఎలుకల
వెంటబడి వేటాడి చంపెదు
దాచుకున్నా పరులలోనీ
ధాన్యమును కాపాడుచుండెద!!

జాలి సుంతయు లేక మీరా
జడ పదార్థం కుర్చీకొరకు
ప్రాణమున్నా నన్ను ఇట్టుల
పారద్రోలుట న్యాయమేనా?’

పిల్లికూతలు విన్న నాకూ
పిల్లిపైనా జాలి కలిగెను!
వానలో గొడుగేసు కెళ్లీ
వసారాలో పిల్లినుంచితి!

తుండుగుడ్డతొ పిల్లి దేహం
తుడిచి, పాలను తెచ్చిపట్టితి,
కుర్చీలోన తొలి విధానా
కుదురుగా కర్చుండ బెట్టితి!!

– అలపర్తి వెంకటసుబ్బారావు,
(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)
94408 05001

➡️