ఫోన్లు.. సోషల్‌ మీడియా..

Apr 1,2024 12:36 #Phones.. Social media..
  • పథకాలు ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం
  • వైఫల్యాలు వివరిస్తున్న ప్రతిపక్షం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి పార్టీ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుని సామాజిక మాధ్యమాలే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రతి ఓటరుకూ ప్రత్యేకంగా ఫోన్లు చేసి మరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఫోన్‌ ప్రచారంలో టిడిపి ముందుంటే, సామాజిక మాధ్యమాల ప్రచారంలో వైసిపి ముందుంది. ఓటర్లకు వైసిపి, టిడిపి వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి వారి పార్టీల గురించి చెప్పుకుంటున్నాయి. ముందుగా రికార్డు చేసిన మాటలు, హామీలను వినిపిస్తున్నాయి. అధికార పార్టీ వైసిపి తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ఓటర్లకు వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి వివరిస్తున్నాయి. అదేవిధంగా మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అంటూ ఆ పార్టీ అభ్యర్థులు, ప్రజా ప్రతినిధుల కార్యాలయాల నుంచి ఓటర్లకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఆరా తీస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాల గురించి టిడిపి వివరిస్తోంది. ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలకు ఫోన్‌ చేసి వైసిపి ప్రభుత్వం పలు పథకాలు రద్దు చేసిందని ప్రచారం చేస్తున్నాయి.
అలాగే నటులతో చేసిన వీడియోలను ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఎక్స్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ప్రచారం చేస్తున్నాయి. టిడిపి, జనసేన కంటే అధికార పార్టీ వైసిపి ఈ ప్రచారంలో ముందు వరుసలో ఉంది. అదే విధంగా రాజకీయ నేతల కార్టూన్‌లతో వీడియోలు తీస్తున్నాయి. వైసిపి తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజల్ని కాపాడే హీరోగా చూపిస్తూ, ఎన్‌డిఎ కూటమి అభ్యర్థులను విలన్లుగా చూపించే కార్జూన్‌ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో చేస్తోంది. ఎన్‌డిఎ కూటమి కూడా జగన్‌ను విలన్‌గా చూపిస్తూ కూటమి నేతలను హీరోలుగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నాయి.

ఏం చేశామో చెప్పలేని స్థితిలో బిజెపి
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో చెప్పుకోలేని స్థితిలో ఉంది. నిజం తెలియాలంటూ మోడీ ఫొటోతో సామాజిక మాధ్యమాల్లో వీడియో ప్రచారం చేస్తోంది. అయితే ఇందులో ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, పోలవరం, అమరావతి నిర్మాణం ప్రస్తావన లేదు. అన్ని రాష్ట్రాలతో పాటు ఇచ్చిన నీటి కుళాయి కనెక్షన్లు, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి రెండు, మూడు పథకాలనే ప్రచారం చేసుకుంటోంది.

➡️